ఘటనాస్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై, ఇళ్లలో పడి ఉన్న అందరినీ గురువారం విశాఖలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వార్డుల్లోకి తరలించేటప్పుడు చనిపోయిన వ్యక్తుల్లా వేలాడిపోవడం, చేతుల నుంచి జారిపోతుండటంతో వైద్యులు, సిబ్బంది కంగారు పడ్డారు. వచ్చిన వారిని వచ్చినట్లే అత్యవసర వార్డులకు తరలించి.. అక్కడ తేరుకున్నాక సాధారణ వార్డులకు పంపించారు. గ్యాస్ ప్రభావం బాగా ఉండటంతో ఒక్కో రోగి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వైద్యులు చెబుతున్నారు.
మా వాళ్లెక్కడయ్యా..?
తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఎల్జీ పాలిమర్స్ చుట్టూ ఉన్న గ్రామాల్లో పలువురు ఉన్న చోటే సొమ్మసిల్లి పడిపోయారు. ఆ సమయం తప్పితే వారికి ఇంకేదీ గుర్తులేదు. కుటుంబీకుల్లో ఎవర్ని ఏ అంబులెన్సులో, ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారో, అక్కడ వారు క్షేమంగా ఉన్నారో లేరో అస్సలు తెలియదు. స్పృహలోకి వచ్చాక ఆసుపత్రుల్లోని రోగుల్లో ఒకటే ఏడుపులు. కొన్ని వాట్సాపు గ్రూపుల్లో ఆచూకీ సమాచారం కోసం సంప్రదింపులు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నానికి కొందరి ఆచూకీ దొరికినప్పటికీ మరికొందరి ఆచూకీ తేలలేదు. కుటుంబంలో ఒకరు గోపాలపట్నం ఆసుపత్రిలో ఉంటే, మరొకరు కేజీహెచ్‌లో ఉండటం లాంటి ఘటనలు ఎదురయ్యాయి. కొందరు తమ చిరునామాలూ సక్రమంగా చెప్పలేకపోయారు. మెదడుపై గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగినప్పుడు బాధితులు లుంగీలు, బనియన్లు, నైటీల్లో నిద్ర పోవడంతో వారిని అలాగే ఆసుపత్రులకు తరలించారు.
''గ్యాస్ పీల్చినప్పుడు ఎక్కడున్నవారు అక్కడే కూలబడిపోయారు. ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు వారు బతుకుతారో లేదో సందేహమే. ప్రాణం ఉందా.... అంటే ఏమో చెప్పలేం అనేవారే.’’- అంబులెన్స్ సిబ్బంది