విశాఖలో సంచలనం స్పష్టించిన ఘరానా కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తే లక్ష్యంగా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌కు పథకాన్ని రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పల్లపు ప్రసాద్, పరపతి రామ్ రెడ్డిని అరెస్టు చేశారు. కేసు వివరాలను విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు.
ఇదీ జరిగింది...
విశాఖలో నిత్యం రద్దీతో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్- రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో ఈ నెల 5న ఓ ఘరానా కిడ్నాప్ జరిగింది. డీఆర్ఎం కార్యాలయం వద్ద ఉన్న సురేశ్ కుమార్ అనే వ్యక్తిని కత్తులు, తుపాకీ చూపించి దుండగులు అపహరించారు. అక్కడి నుంచి పరవాడ ప్రాంతంలోని ఓ విల్లాకు తీసుకువెళ్లారు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని తీవ్రంగా బెదిరించి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పిన సురేశ్... 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు.
అయితే ఆ డబ్బును కూడా తన భార్య బంగారం తాకట్టు పెట్టి ఇవ్వగలనని చెప్పాడు. సరేనన్న కిడ్నాపర్లు సురేశ్‌ను తీసుకుని విశాఖ నగరంలోని ద్వారకానగర్ ఐఐఎఫ్ఎల్ వద్దకు చేరుకున్నారు. ఐఐఎఫ్ఎల్లో బంగారం తాకట్టు పెట్టి నిందితులకు డబ్బు ఇవ్వాలని సురేశ్ భావించారు. ముందుగా సమాచారం ఇవ్వటంతో అతని భార్య బంగారం తీసుకుని కుమారుడితో పాటు అక్కడికి చేరుకున్నారు. సురేశ్ పైనా గతంలో కొన్ని కేసులు ఉండటంతో ఈ డబ్బును కావాలని దుబారా చేస్తున్నాడేమో అని భావించిన భార్య.. అతనితో గొడవకు దిగింది.
ఇదంతా ఓ వైపు జరుగుతుండగానే సురేశ్ కుమారుడు 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన నిందితులు సురేశ్‌ను విడిచిపెట్టి పారిపోయారు.
నిందితుడితో బాధితుడికి పరిచయం...
ఈ కేసులో ప్రధాన నిందితులు పల్లపు ప్రసాద్, పరపతి రామ్ రెడ్డిని విశాఖ పోలీసులు 72 గంటల్లోగా అరెస్టు చేశారు. వీరితో పాటు బాధితుడిపైనా గతంలో కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరంతా రైస్ పుల్లింగ్, నకిలీ నోట్ల కేసుల్లో ప్రమేయం ఉన్న వాళ్లని గుర్తించారు. ప్రస్తుత కేసులో ఏ2గా ఉన్న రామ్ రెడ్డితో కలిసి సురేశ్ గతంలో మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఏ1గా ఉన్న పల్లపు ప్రసాద్ జూన్ 25న గుంటూరు నుంచి విశాఖకు కుటుంబంతో కలిసి వచ్చాడు. తరువాత తనకు పరిచయస్తుడైన రామ్ రెడ్డిని కలిసి కిడ్నాప్ చేయడానికి పథకం రచించారు. అయితే అప్పటికే మోసాలకు పాల్పడి కేసుల్లో ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేస్తే తమపై ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని నిందితులు భావించారు. ఈ కిడ్నాప్‌నకు హైదరాబాద్‌లో ఉండే వారి సహకారాన్ని తీసుకున్నామని విచారణలో నిందితులు వెల్లడించారు.
ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు విషయంలో అత్యంత వేగంగా స్పందించిన నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బందిని కమిషనర్ ఆర్కే మీనా నగదు బహుమానం ఇచ్చి అభినందించారు.