విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా-జనసేన కూటమి విడుదల చేసింది. ఈనెల 10న గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో... ఇరు పార్టీల నేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగరంలోని సమస్యలను పొందుపరచినట్టు చెప్పారు. ఒకప్పుడు సుందరంగా ఉండే విశాఖ... ఇప్పుడు సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్‌గా మారిపోయిందని జనసేన నేత శివశంకర్ అన్నారు. నగర అభివృద్ధి, సంక్షేమంపై కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఈ నగరానికి ఎంతో చేశామని శాసనమండలి సభ్యులు మాధవ్ పేర్కొన్నారు. నీటి ఎద్దడి తీర్చి 24 గంటలు మంచి నీరు ఇచ్చేలా జలజీవన్ మిషన్ అమలు చేస్తామని చెప్పారు. 100 గజాలలోపు ఇల్లుకు ఎలాంటి పన్నులు ఉండవని స్పష్టం చేశారు. మురుగు నీరు సముద్రంలోకి వదలకుండా చూడటం... ఎన్ఏడి ఫ్లైఓవర్‌పై ప్రమాదాలు తగ్గించడం వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.
బిఆర్టిఎస్ రోడ్ ఎవ్వరికీ ఉపయోగపడటంలేదని... దాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని మాధవ్ వివరించారు. పరిశ్రమలకు 1000 ఎకరాల భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని, మిగతా పార్టీలకు వ్యాపారాలు తప్ప విశాఖ అభివృద్ధి పట్టదని మాధవ్ విమర్శించారు. విశాఖలో భాజపా-జనసేన కలిసి 95 సీట్లలో పోటీ చేస్తున్నటు ప్రకటించారు.
ఇదీ చదవండీ... విశాఖ ఎన్నికలు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవాలి: చంద్రబాబు