రైల్వేస్టేషన్ అంటే వచ్చామా, రైలెక్కామా అన్నదే కాదు! అసలు ఇక్కడికి వచ్చి ఏమేం చూశామా అనేలా ఉండాలి అన్నట్లుగా.. విశాఖ రైల్వేస్టేషన్ ఆహ్వానిస్తోంది. ప్రయాణికులకోసం ఇక్కడున్న ఏర్పాట్లు అలాంటివి మరి. అసలు ఇంతలా ఏమున్నాయ్ ఆ స్టేషన్‌లో అంటే.. రండి చూసేద్దాం ఓ సారి!
వీడియోకాల్ చేస్కోండి:
![video call instrument](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_489.jpeg)
అబ్బురపరిచే ఓ ఎత్తయిన వినూత్న పరికరం రైల్వేస్టేషన్‌లో ఉంది. దీనికి ‘'హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్' అని పేరు. ఉచితంగా ఫోన్, వీడియోకాల్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ల్యాప్‌టాప్, ఫ్లోనకూ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. విశాఖ రైళ్లు, వాతావరణ సమాచారం, ఇతర ప్రకటనలతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణా ఇందులో ఉంది.
హ్యాపీ.. వైఫై:
![wifi facility](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_931.jpg)
రైల్వేస్టేషన్ ఆవరణలో, ప్లాట్‌పామ్ మీద ఎక్కడున్నా.. ఉచిత వైఫై సేవల్ని రైల్వే అందిస్తోంది. దీన్ని ప్రయాణికులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ప్రయాణికులకు నచ్చేలా రైల్వే ప్లాట్‌ఫామ్‌లను ఎప్పటికప్పుడు యంత్రాంగం శుభ్రంగా ఉంచుతున్నారు.
పే....ద్ద గాంధీ అద్దం!
![selfie area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_619.jpeg)
మరో ఆసక్తికర సెల్ఫీపాయింట్ రైల్వే బస్టాప్ దగ్గరుంది. స్వచ్ఛభారత్ స్ఫూర్తిని ప్రయాణికుల్లో నింపేందుకు.. గాంధీ అద్దాల్నిపోలిన పేద్ద అద్దాల్ని ఇక్కడుంచారు. వాటిమధ్య గాంధీ నడుస్తున్నట్లు, ఇరువైపులా గుర్రాలు అమాంతం పైకి లేచి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది ఇది. అద్దాల వెనక.. పెద్ద జాతీయజెండా, ఆ పక్కనే ఫౌంటేన్, పురాతన రైలు ఉంటాయి.
ఆనాటి వింటేజ్ క్రేన్:
రైలు ప్రమాదాలు జరిగినప్పుడు పట్టాలపై పడి ఉన్న రైల్వే కోచ్‌లను, వ్యాగన్‌లను తొలగించేందుకు.. పాతరోజుల్లో ఈ వాహనాన్ని వాడేవారు. దీన్ని 'వింటేజ్ క్రేన్' అంటున్నారు. జ్ఞానపురం వైపున్న స్టేషన్ ముఖద్వారం దగ్గర దీన్ని ప్రదర్శనకు ఉంచారు.
పిల్లల ఆటా పాటా.. తొలిసారిగా:
![arrangements made for children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_188.jpeg)
ఒక రైల్వేస్టేషన్‌లో పిల్లలకోసం ఆడుకునే విడిది స్థలం ఏర్పాటుచేయడం రైల్వే చరిత్రలో తొలిసారి. ప్లాట్‌ఫామ్-1లో 'ఎంటర్‌టైన్‌మెంట్ జోన్' పేరుతో ఇది ఆకట్టుకుంటోంది. పిల్లలు ఆడుకునే వివిధరకాల బొమ్మలు, ఆటవస్తువులు ఇక్కడున్నాయి.
విలాస లాంజ్:
![lounge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_323.jpeg)
స్టార్ హోటల్‌లో ఉన్నామా అనుకునేలా విశాఖ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్-1లో రిజర్వ్‌డ్ లాంజ్ ముస్తాబైంది. రిజర్వేషన్ టికెట్ ఉన్నవారికి నిర్ణీత రుసుముతో, పరిమిత సమయం వరకు ఇందులో సేద తీరే అవకాశముంటుంది. ఇందులోని ఫ్యాన్లు, లైట్లు, ఏసీ లాంటివన్నీ మాటలు, సంజ్ఞలతో ఆన్, ఆఫ్ అయ్యే విధంగా రూపొందించారు. ఈ తరహా లాంజ్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే తొలిసారి. ప్లాట్‌ఫామ్-8లో సాధారణ ప్రయాణికులకోసం మరో లాంజ్ ఉంది.
ఫొటో గ్యాలరీ:
![ancient railway gallery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_1003.jpeg)
రైల్వే ఏర్పాటైన మొదట్లో వాల్తేరు డివిజన్‌లో పనులు ఎలా జరిగాయి?, ఇక్కడ రైల్వే ప్రాముఖ్యత, భారతదేశంలోని అరుదైన రైల్వే ఫొటోలు.. తదితరాలతో ఓ చిన్న రైల్వే ఫొటో గ్యాలరీ ఇక్కడుంది. ఫ్లాట్‌ఫామ్-1 నుంచి బస్టాప్‌వైపు బయటికి వచ్చే ద్వారం దగ్గర ఇది ఉంటుంది. వివిధ రకాల ప్రతిభ ఉన్నవారు ఇక్కడి స్థలంలో ప్రదర్శనలూ ఇవ్వొచ్చు.
ఆరోగ్యపరీక్షల బండి:
![health check up desk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-er-vsp-156-31-attention-bharat-vskp-railway-station-attractions-9823807_31012021082827_3101f_1612061907_612.jpeg)
'హెల్త్ ఆన్ వీల్స్'’ పేరుతో ప్లాట్‌ఫామ్-1లో ఒక స్టాల్‌ను ఏర్పాటుచేశారు. త్వరలో ఇది అమల్లోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. రూ.100కే ఇక్కడ 30రకాల ఆరోగ్యపరీక్షలు చేస్తారు. బీపీ, షుగర్, బీఎంఐ, ఎత్తు, బరువు, గుండెకొట్టుకునే తీరు.. ఇలాంటి పరీక్షలు అందులో ఉంటాయి. ఈ వాహనాన్ని ఇతర ప్లాట్‌ఫామ్‌లో ఎక్కడికైనా తీసుకెళ్లేలా చక్రాలుంటాయి. దీంతో పాటు మరో ఆరోగ్య కియోస్క్‌ను కూడా తెస్తున్నారు.
ఇదీ చదవండి: