విశాఖలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20కు చేరుకున్నాయి. అల్లిపురం, అక్కయ్యపాలెం, టౌన్ కొత్త రోడ్, తాడిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీలను అధికారులు అత్యంత సున్నిత ప్రాంతాలుగా ప్రకటించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో జీవీఎంసీ అధికారులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 504 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా... వారిలో 472 మందికి నెగటివ్ అని తేలింది. 20 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
దిల్లీ నుంచి వచ్చిన వారికి పరీక్షలు
కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలు కొంతవరకూ ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దిల్లీ నుంచి విశాఖ వచ్చిన వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో నిన్నటి వరకు ఐసోలేషన్‌లో 493 మంది చేరగా.... వారిలో 457 మందిని వైద్యాధికారులు డిశ్చార్జ్ చేశారు. మరో 36 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారలు తెలిపారు.
ఐసోలేషన్‌కు 4434 పడకలు సిద్ధం
జిల్లాలోని 25 కేంద్రాల్లో 4,434 పడకలను ఐసోలేషన్‌కు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలమంచిలిలో 45 మంది, నర్సీపట్నంలో 15 మంది, విశాఖపట్నం రైల్వే ఆసుపత్రిలో 45 మంది, గాజువాక వికాస్ జూనియర్ కాలేజి 16 మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కరోనా అనుమానితులకు విశాఖ ఛాతి ఆసుపత్రిలో, గీతం వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల మందిని ప్రభుత్వ బృందాలు నేరుగా కలసి పరీక్షించారు. విశాఖ విమ్స్‌ను రాష్ట్ర కొవిడ్-19 ఆస్పత్రిగా మార్చి తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వచ్చిన కేసులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి 21 కమిటీలతో జిల్లా కమిటీ పని చేస్తుందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు.
కరోనా నివారణకు దుర్గా సప్తశతి చండీయాగం
విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కరోనా నివారణకు దుర్గా సప్తశతి చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థం మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి, స్వరూపిణీ దుర్గా సప్తశతి చండీయాగం నిర్వహణ ఋత్వికుల ఆధ్వర్యంలో జరిగింది.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులు వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులను పోలీసులు ఆపి వారి చేతిలో ప్లకార్డులు పెట్టి రహదారిపై నిలబెడుతున్నారు.
ఇదీ చూడండి: