తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేధింపుల కారణంగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారని... వైకాపా శాసనమండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కోడెలను పిలవలేదని, ఆయన ఉండగానే మరొకరిని ఇంఛార్జ్‌గా నియమించి మనసును క్షోభపెట్టారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు.
తునిలో కాపు ఉద్యమం కోసం పోరాడిన ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు తత్వమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న చంద్రబాబు... రౌడీయిజం పేటెంట్ తీసుకున్నారని దుయ్యబట్టారు. తెదేపా మళ్ళీ భాజపా, జనసేన పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు... రివ్యూల పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారని... ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చలు మానేసి జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... 'పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టండి'