జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికల ఆధారంగానే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికే హైపవర్ కమిటీ ఏర్పాటయిందని స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయంగా ఉంటుందని తెలిపారు. రైతులకు సంబంధించిన అజెండాకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వెల్లడించారు. అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని పునరుద్ఘాటించారు. ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు తరలిపోతాయన్నది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
అభివృద్ధి కేంద్రీకృతం కాదు
హైదరాబాద్ తరహాలో మళ్లీ అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని సీఎం జగన్ భావిస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రతిపక్షాలు అమరావతిలో పేద రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దిల్లీలో నాయకులను అడ్డుపెట్టుకొని న్యాయ వ్యవస్థ ద్వారా రాజధానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో గృహ అవసరాల కోసమే ల్యాండ్ పూలింగ్ చేసే అవకాశం ఉందని... అందు కోసం జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి పని చేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:బీసీజీ నివేదికపై అధ్యయనానికి హైపవర్ కమిటీ