ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన భూమి రీ సర్వే సెటిల్మెంట్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని.. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అయితే ఈ విషయంలో ఉన్నతాధికారుల వ్యవహారశైలి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందని ఆరోపించారు.
విశాఖలో మాట్లాడుతూ.. వందేళ్ల తర్వాత భూమి రీ సర్వే చేయడం సాహసోపేత నిర్ణయమని బొప్పరాజు అన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ నిర్ణయం అమలులో భాగంగా సెటిల్మెంట్ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూమి హక్కులను నిర్ధరించే ప్రక్రియలో సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉందని.. దీనిపై ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికార్లతో చర్చలు జరపాలని కోరారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవోలతో చర్చించి సర్వేను సమర్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ బదిలీలు చేసుకుంటున్నారని బొప్పరాజు ఆరోపించారు. 136 మంది పోస్టింగులపై నిషేధం ఉన్నా బదిలీలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనాతో 70కి పైగా రెవెన్యూ అధికారులు మృతి చెందారని.. వాక్సిన్ వచ్చేవరకు స్థానిక ఎన్నికలు చేపట్టవద్దని ఈసీని కోరారు.
ఇవీ చదవండి..