కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖలోని తాటిచెట్లపాలెంకు చెందిన హరిప్రసాద్... ప్రతి ఏడాది తన ఇంటి ముందు పందిరి వేసి ప్రజలకు ఏదైన అంశంపై సందేశాన్ని ఇచ్చేలా విగ్రహాలను ఏర్పాట్లు చేసేవాడు. ఈ ఏడాది కరోనా కారణంగా మండపాల్లో వినాయక చవితి చేసేందుకు అనుమతులు ఇవ్వకపోవటంతో... తన ఇంటి వద్దనే మట్టి వినాయక విగ్రహానికి మాస్క్ అలంకరించారు.
చేతులకు గ్లౌస్ వేసుకుని మొహానికి ఫేస్ షీల్డ్ పెట్టుకుని ఉన్న వినాయకుడు... పక్కనే పీపీఈ కిట్ వేసుకుని శానిటైజర్‌తో ఉన్న మూషికాన్ని ఏర్పాటు చేశాడు హరిప్రసాద్. అంతేకాకుండా విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన వారికి ఉచితంగా మాస్క్‌లను పంపిణీ చేస్తున్నాడు.
వ్యర్థాలతో విగ్రహం
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం స్థానికులను ఆకట్టుకుంటోంది. శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో.... చీరల అట్ట ముక్కలు, వ్యర్థ పదార్థాలతో ఐదు అడుగుల గణనాథుడిని రూపొందించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తూ... స్వామివారి ఒక చేతిలో మాస్క్, మరో చేతిలో శానిటైజర్ ఉంచారు. 5 అడుగుల విగ్రహం బరువు 2 నుంచి మూడు కిలోలు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.