విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ వెలువడుతుందని ఆశించిన ఉత్తరాంధ్ర వాసులకు ఈ డివిజన్‌ను పూర్తిగా కనుమరుగు చేయడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఖుర్డా డివిజన్‌లో ఉన్న ఉత్తరాంధ్రలోని ప్రధాన స్టేషన్లు పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తూర్పు కోస్తాలోనే ఉంటాయన్న అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వాల్తేరు కనుమరుగు
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటనలో భాగంగా రైల్వే మంత్రి నిర్దేశించిన అంశాలను పరిశీలిస్తే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి రానున్నాయి. వాల్తేర్ డివిజన్‌ను విడదీసి కొంత భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపేస్తారు. మిగిలిన భాగంతో రాయగడ డివిజన్‌ను కొత్తగా తూర్పు కోస్తా రైల్వేలో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం వాల్తేరుడివిజన్ 1106 కిలోమీటర్ల పరిధిలో ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఉన్న కెకెలైన్, కేఆర్ లైన్లు గరిష్ఠంగారెవెన్యూ అందిస్తున్నాయి. ముడి ఖనిజం విశాఖ పోర్టు నుంచి ఎగుమతి కావడంతో ఈ డివిజన్ మొత్తం తూర్పు కోస్తా రైల్వేలోనే అగ్రగామిగా దాదాపు ఏటా ఏడువేల కోట్ల రూపాయిలను అర్జిస్తోంది. అత్యధిక రెవెన్యూ వస్తున్న వాటిని రాయగడ డివిజన్ లో కలిపేసి అసలు వాల్తేరు డివిజనే లేకుండా చేయడం ఏమాత్రం సమంజసం కాదని..ఉత్తరాంధ్ర వాసులు అభిప్రాయపడుతున్నారు.దేశంలో ఉన్న రైల్వే డివిజన్లలోనూ అత్యధిక ఆదాయం అర్జిస్తున్న డివిజన్లలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ తొలి ఐదుస్ధానాల్లోనే నిలుస్తూ వస్తోంది.
ఇది కూడా చదవండి:'రైల్వే జోన్ ప్రకటన మోసం'