విశాఖ నగరంలోని ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన వైద్యుల వసతి సముదాయం (క్వార్టర్ల) ఆవరణలో కొత్తగా ఏడు భవనాలను నిర్మిస్తున్నారు. కొద్దిరోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో భవనంలో ఏడు ఫ్లాట్లు ఉంటాయని, ప్రతి ఫ్లాటులో మూడు పడక గదులు ఉంటాయని చెబుతున్నారు. తమ శాఖ స్థలంలో... తమకు సమాచారం ఇవ్వకుండానే చేపట్టిన ఈ పనులు వైద్యవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నగరంలోని మహారాణిపేట ప్రాంతంలో వైద్య కళాశాలకు చెందిన వైద్యుల కోసం పది ఎకరాల విస్తీర్ణంలో 30 క్వార్టర్లు ఉన్నాయి. వాటిలోని 20 శిథిలావస్థకు చేరగా వినియోగించడంలేదు. పది క్వార్టర్లలో మాత్రం వైద్యులు నివాసముంటున్నారు. వీటి ప్రహరీని ఆనుకొని ఉన్న ఖాళీ భూమిలో రూ.4.50 కోట్ల ఖర్చుతో ఏడు క్వార్టర్లను నిర్మిస్తున్నారు. పనులను ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక సదుపాయల కల్పన అభివృద్ధి సంస్థ) పర్యవేక్షిస్తోంది. నిర్మాణాలు ఎవరి కోసం జరుగుతున్నదీ ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు వెల్లడించడం లేదు.
* ఎంతో విలువైన ఈ భూమి చాలాకాలంగా నిరుపయోగంగా ఉంది. రాజధాని విశాఖకు తరలి వస్తుందన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో దీనిపై అధికారులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల నివాసాలకు ఇక్కడ బహుళ అంతస్తుల సముదాయలు నిర్మిస్తే సుమారు వంద వరకు క్వార్టర్లు వచ్చే అవకాశముంది. దీనికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసి, తొలి విడతగా ఏడు క్వార్టర్లు, తదుపరి దశలో అపార్టుమెంట్లు, గ్రూపు ఇళ్ల తరహాలో నిర్మిస్తారని సమాచారం. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా... ‘‘క్వార్టర్లు నిర్మించే ముందు మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. పనుల గురించి తెలియగానే ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశాం. సీనియర్ వైద్యుల కోసం క్వార్టర్ల నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు’’ అని వివరించారు.