కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో సీఐటీయూ నాయకులు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి కడపకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రహమత్ పూర్ కూడలి నుంచి యాత్ర ప్రారంభమయ్యింది. కడప వరకు ర్యాలీ కొనసాగుతుందని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు.
విశాఖలో విద్యార్థుల ఆందోళన..
విశాఖలో ఏయూ విద్యార్ధి సంఘం, ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తునట్లు తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీతమ్మధార రోడ్డుపై మోకాళ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించే వరకూ ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు.
విశాఖ ఉక్కు, ఎన్ఎండీసీ, సెయిల్ ఒకటిగా ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతుంటే... ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత గనులు లేకపోవడం వలనే ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం పూనుకుందని ఆరోపించారు. వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించి... ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల మార్పు