రుషికొండకు తాను వెళ్తానంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. కట్టేది పర్యాటక ప్రాజెక్టే అయితే జగన్ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు? అని ప్రశ్నించారు. విశాఖలో వైకాపా నేతల కబ్జాలు, ఆక్రమణలను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ రుషికొండను పిండి చేస్తున్నారని మండిపడ్డారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా తాళ్లవలసలో నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు..భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్ పాదయాత్ర చేశారన్నారు. జగన్ బాదుడుకు రుషికొండ తరిగిపోయిందని ఆరోపించారు. రుషికొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని..,జగన్ కన్ను పడితే ఏదైనా గోవిందా.. గోవిందా.. అని ఎద్దేవా చేశారు.
"నా పోరాటం నా కోసం కాదు.. ప్రజల కోసం. నరకాసుర వధ పోరాటంలో అందరూ కలిసి రావాలి. జగన్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. జగన్ బాదుడే బాదుడుకు విరుగుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో పెట్రోల్ ధర అధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని మోదీ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను జగన్ ఎందుకు తగ్గించరు?. పెట్రోల్ ధర ఏపీలో కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజకీయాలు వదులుకుంటా. ఎవరికీ లేని వింత ఆలోచనలు జగన్‌కు వస్తాయి. కోడి కత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో గెలిచారు. జగన్ వల్ల 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. నాడు - నేడు అని పాఠశాలలకు వైకాపా రంగులు వేశారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులపై కోర్టు చీవాట్లు పెట్టింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల బాగా చదివే విద్యార్థులు నష్టపోతారు." -చంద్రబాబు, తెదేపా అధినేత
విశాఖ అభివృద్ధికి అనేక కంపెనీలు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలన వల్ల కంపెనీలన్నీ వెళ్లిపోయాయని మండిపడ్డారు. ఏపీలో అన్నిరకాల సహజ వనరులు ఉన్నాయని..వాటిని సరిగా వాడుకుంటే 2029లోగా నెంబర్‌వన్ రాష్ట్రం అవుతుందన్నారు. అనాడు తాము అడ్డుకుంటే పాదయాత్ర చేయడం సాధ్యమయ్యేదా ? అని జగన్‌ను ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఊరికొక ఉన్మాది తయారయ్యాడని ఆక్షేపించారు. గంజాయికి ఏపీ అడ్డాగా మారుతోందని తాను ఎప్పుడో చెప్పానన్నారు. వివిధ రకాల పన్నుల పేరుతో ప్రజలపై పెనుభారం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్లే మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు.
"హుద్‌హుద్ తుపాను వస్తే వారంలోగా సాధారణ స్థితికి తెచ్చాం. ఒక్క పిలుపు ఇస్తే విశాఖ వాసులు దీపావళి కూడా జరుపుకోలేదు. వైకాపా ప్రభుత్వం ఇచ్చేవన్నీ పాత పథకాలే. తెదేపా పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. మేం వచ్చాక సైకోలు అందరికీ తోకలు కట్ చేస్తా. తెదేపా పాలనలో రౌడీలు, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాం. వైకాపా ప్రభుత్వం నేరస్థులను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అంబులెన్స్‌లు పనిచేయవు. మహాప్రస్థానం వాహనాలు ఉన్నా నడవవు."- చంద్రబాబు, తెదేపా అధినేత