తూర్పు గోదావరి జిల్లాలో..
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ నటుడు పవన్ కల్యాణ్ 50వ జన్మదినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా గండేపల్లి మండలం సూరంపాలెం, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, లింగంపర్తితో పాటు.. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరులో నాయకులు కేక్ కట్ చేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఏలేశ్వరంలో అభిమానులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో జనసేన ఇంఛార్జి వరపుల తమ్మయ్యబాబు పాల్గొన్నారు. అనంతరం జనసైనికులతో కలిసి సీహెచ్‌సీలోని (కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్) రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రత్తిపాడులోని పేదలకు, రోగులకు అన్నదానం చేశారు.
జనసేనాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పార్టీ నేతలు.. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలాలను ఇచ్చినట్లే ఇచ్చి దోచుకుంటోందని నేతలు మండిపడ్డారు.
జిల్లాలోని తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రమదానంతో గ్రామంలో పూర్తిగా పాడైన రహదారులను బాగుచేశారు. ఇందుకోసం అవసరమైన సుమారు రూ. 80 లక్షలను విరాళాల రూపంలో సేకరించారు. వాటిని గ్రావెల్ కొనుగోలుకు వినియోగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది వరకు భాగస్వాములయ్యారు.
విశాఖ జిల్లాలో..
పాయకరావుపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త గడ్డం బుజ్జి, భాజపా నేత తోట నగేష్ ఇందులో పాల్గొన్నారు. కేక్ కట్‌చేసి.. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
తుమ్మపాల, కుంచంగి గ్రామాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జనసైనికుల రక్తదానం చేశారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
విజయనగరం జిల్లాలో..
జిల్లాలోని గరివిడి మండలంలోని కాపు సంభం గ్రామంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 100 మంది పేద మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొత్తతరం రాజకీయానికి పునాది వేసిన పవన్ కల్యాణ్‌కు అందరూ మద్దతుగా నిలవాలని యశస్విని పిలుపునిచ్చారు. జనసైనికులు పవన్ వెంట అండగా ఉండాలని ఆమె అన్నారు.
ఇదీ చదవండి:
Engineering Counseling: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మార్పు