No Permission to Cruise Ship: ఈనెల 8న విశాఖ నుంచి బయల్దేరిన క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించిన క్రూయిజ్ షిప్ ఈరోజు ఉదయం పుదుచ్చేరి చేరుకోవాలి. అయితే క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌కు అనుమతిచ్చేది లేదంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై బ్రేక్ వేశారు. దీంతో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షిప్ నడి సముద్రంలోనే ఆగిపోయింది. క్యాసినో, గ్యాంబ్లింగ్ ఉండే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించొద్దంటూ అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన గవర్నర్ క్రూయిజ్‌ను అనుమతించాలంటే అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ లేదని నిర్ధారణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ క్రూయిజ్ షిప్‌కు లంగరు వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టూరిజంను డెవలప్ చేయాలనే ఆసక్తి ఉన్నా.. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్నారు.
కేవలం ఆదాయం కోసం యువత జీవితాలను పాడు చేయమని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలకు లగ్జరీ క్రూయిజ్‌లో కొత్త సముద్ర ప్రయాణ అనుభూతిని అందించాలని తమిళనాడు ప్రభుత్వం కోర్డెలియా క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో భారీ క్రూయిజ్ సముద్రం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సాగరంలో ఓ స్టార్‌హోటల్! : మన భారత సముద్రజలాల్లో తిరుగుతున్న అతిపెద్ద ప్రయాణికుల నౌకల్లో ఈ ‘కార్డేలియా క్రూయిజ్-ఎమ్వీ ఎంప్రెస్’ నౌక ఒకటి. ఇందులో ఒక్కసారే పదిహేను వందల మంది దాకా ప్రయాణించవచ్చు. ఓడలో మొత్తం 11 అంతస్తులుంటాయి. ఇంజిన్‌కీ, సరకులకీ కిందున్న రెండు అంతస్తులు పోగా... మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి పదో అంతస్తుదాకా లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు.
10వ అంతస్తులో ఓ పేద్ద డాబాలాంటి డెక్ ఉంటుంది. పదకొండో అంతస్తులో సూర్యోదయం, సూర్యాస్తమయాలని చూడటం కోసం ప్రత్యేకంగా మరో ప్రత్యేక డెక్‌నీ ఏర్పాటు చేశారు. ఇందులో నిల్చుని అనంత సాగరాన్ని వీక్షించడం... ఓ అద్భుతమైన అనుభవమనే చెప్పాలి. మూడో అంతస్తు నుంచి తొమ్మిది దాకా... వివిధ స్థాయి వసతులతో కూడిన గదులుంటాయి. మామూలు గదులైనా సూట్‌లైనా శుభ్రతా ప్రమాణాలూ, ఆహార వసతులన్నీ ఓ స్టార్‌హోటల్ స్థాయిలోనే ఉంటాయి. ప్రయాణికుల కోసం ఇందులో రెండు పెద్ద రెస్టరెంట్లున్నాయి. ప్రపంచంలోని అన్నిరకాల ఆహారాన్నీ ఇక్కడ రుచిచూడొచ్చు. పిల్లల ఆటల కోసం కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో అతిపెద్ద ఆవరణ ఉంటుందిక్కడ. ఇవే కాకుండా జిమ్, ఈతకొలను, క్యాసినో, కామెడీ షోల కోసం సభావేదికలూ, కొత్త సినిమాల కోసం థియేటర్‌లూ, 24 గంటలూ పనిచేసే సూపర్‌మార్కెట్లూ ఉన్నాయి.
ఈ క్రూయిజ్ విశాఖ నుంచి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి జులై వరకూ పర్యటనలు నిర్వహిస్తుంది. టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. ధర మనం తీసుకునే గదిని బట్టి 27 వేల నుంచి 1.27 లక్షల రూపాయల దాకా ఉంటుంది. థ్రిల్లోఫోబియా, యాత్రా వంటి ఆన్‌లైన్ పర్యటక సంస్థలు ఈ క్రూయిజ్ టికెట్లని కొంత రాయితీలతో అందిస్తున్నాయి. అన్నట్టు, ఒక ఏడాదిపాటు- పన్నెండేళ్లలోపున్న పిల్లల్ని ఉచితంగానే అనుమతిస్తున్నారు!
ఇవీ చూడండి