‘అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన వందల ఎకరాల భూములను దోచుకుని, అన్యాక్రాంతం చేసి విక్రయించగా వచ్చిన సొమ్ముల్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగతంగా వాడుకున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఫోర్జరీ కేసులో గతంలో ఎఫ్.ఐ.ఆర్. నమోదైందని ఆయన ఏ రోజైనా జైలుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు, పొదుపు సంఘాల మహిళలు, సచివాలయ సిబ్బందికి ‘ఆనందయ్య’ కరోనా మందును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా.. అశోక్ గజపతిరాజు విక్రయించిన భూముల వివరాలు సేకరిస్తున్నామని.. అవి వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అశోక్ గజపతిరాజు అనువంశిక వారసత్వ ఛైర్మన్‌గా ఉండొచ్చని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లబోతున్నామని తెలిపారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఒక సభ్యుడు మాత్రమేనని, రాజు చెప్పిందే వేదం అనుకోవద్దని హితవుపలికారు. అనువంశికంగా పురుషులు మాత్రమే ఛైర్మన్ అవ్వాలన్న నిబంధన సరికాదన్నారు. దేవాదాయ చట్టంలో లోపాలుంటే సవరించి ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తారని తెలిపారు.
మరో 25ఏళ్లు జగన్ పరిపాలనే..
రాబోయే 25 సంవత్సరాలు జగన్‌మోహన్‌రెడ్డే పరిపాలిస్తారన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆనందయ్య మందును విశాఖ పరిధిలో 22 వేల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, సత్యవతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: