విశాఖలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థల డేటా కేంద్రాల ఏర్పాటు కోసం వాటి ప్రతినిధులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ తన డేటా కేంద్రం ఏర్పాటుకు ముందుకు వస్తే దేశంలో ఇదే మొదటిది అవుతుందని అధికారులు చెబుతున్నారు. డేటా కేంద్రాల ఏర్పాటుతో వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా విశాఖకు వీటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలకు అవసరమైన అన్ని సాంకేతిక సేవలను కూడా మైక్రోసాఫ్ట్ నుంచి పొందుతామని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ నుంచి కొంత సానుకూల స్పందన కనిపిస్తోందని వారు తెలిపారు. ప్రస్తుతం ‘పై’ సంస్థ అందించే సేవలను ప్రభుత్వ శాఖలు వినియోగించుకుంటున్నాయి.
విశాఖలో అమెజాన్ వెబ్ సర్వీస్(ఏడబ్ల్యూఎస్) కేంద్ర ఏర్పాటు కోసం అమెజాన్ సంస్థ దేశీయ వ్యవహారాల పర్యవేక్షణ అధికారులతో ఇప్పటికే ఒకసారి సంప్రదింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అమెజాన్‌కు హైదరాబాద్‌లో వాణిజ్య కేంద్రం మాత్రమే ఉంది. విశాఖలో అదానీ సంస్థ ఏర్పాటుచేసే డేటా కేంద్రానికి 200 ఎకరాలను కేటాయించాలన్న ప్రతిపాదనలను గతకేబినెట్ సమావేశంలో ఆమోదించాలని భావించినా ఆఖరి నిమిషంలో ఉపసంహరించినట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లతో జరుగుతున్న చర్చలే ఇందుకు కారణమని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.