ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చని చెట్లు, అలల హొయలు, పసిడి కొండలు, జలపాతాలు, ఇసుక తిన్నెలు వాటి చుట్టూ ఉండే వేలాది, లక్షలాది జీవజాతులు పంచే మధురానుభూతిని ఆస్వాదించడమే పర్యాటకం ముఖ్య ఉద్దేశంగా భావిస్తుంటాం. కానీ, ఆ స్పృహ కొరవడి పర్యావరణం ఒడిలో ఆనందిస్తూనే... అక్కడి వాతావరణాన్ని కాలుష్య కేంద్రాలుగా మార్చేసిన అనుభవం మనకు ఉంది. ఊహించని విధంగా వచ్చిన కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మనం చేసిన తప్పులు మన కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఇంత కాలం ప్రకృతి విధ్వంసం ఈ స్థాయిలో జరిగిందా అనే ఆలోచన కలిగింది. ఆ చలనం ఒక మార్పు దిశగా అడుగు వేసేలా చేస్తుందని అనుకున్నాం. కానీ, ప్రస్తుతం పర్యాటక ప్రదేశాల్లో ఉన్న పరిస్థితి చూస్తుంటే మనలో ప్రకృతి పట్ల ఇంకా బాధ్యత పెరగలేదని స్పష్టం అవుతోంది.
వ్యర్థాల కూపంగా ఆర్కే బీచ్...
విశాఖ అంటే ముందుగా గుర్తుకు వచ్చే ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు...ఇప్పుడు అది ఎటు చూసిన చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. తీర ప్రాంత ప్రశాంతతను ఆస్వాదించడానికి వచ్చిన సందర్శకుల నిర్లక్ష్యం, పరిసరాల పట్ల బాధ్యతా రాహిత్యం... ప్లాస్టిక్ భూతాన్ని తిరిగి ఇసుక తిన్నెలకు పరిచయం చేస్తున్నాయి. పరిశుభ్ర నగరంగా పేరు దక్కించుకున్న విశాఖ నగరానికి ఎంతో వన్నె తెచ్చే బీచ్ విషయంలో ప్రజలు అవగాహనతో ఉండాల్సిన అవసరముంది. ఇప్పుడిప్పుడే పర్యటక ప్రదేశాలకు తాకిడి పెరుగుతున్నందున సందర్శకులు మొదటి నుంచి బాధ్యతగా ఉంటే ఆ ప్రభావం రానున్న రోజుల్లో పరిశుభ్రత కొనసాగడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ దిశగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేందుకు ఇటు పర్యావరణ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.
ప్రజల సహకారం అవసరం..
కొవిడ్ విధుల్లో ఇప్పటికే అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కొత్త సమస్యలు తెచ్చి పెట్టకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వం ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచిన చెత్త తొట్టెలను వినియోగించడం ద్వారా చాలా వరకు పర్యటక ప్రదేశాలను శుభ్రంగా ఉంచవచ్చు.
స్వచ్ఛ లక్ష్యాలను నిర్దేశించుకుని శరవేగంగా ముందుకు వెళుతున్న సమయమిది. ఒక్కో మెట్టు పైకి వెళ్లాల్సిన తరుణంలో తిరోగమనం అంటే... అది స్వచ్ఛ స్ఫూర్తిని దెబ్బతీయటమే. నగరాలు ఎంత సుందరంగా ఉంటాయనే దానికి అద్దం పట్టేవి పర్యాటక ప్రదేశాలు. ఆ విషయాన్ని గుర్తించి... ప్రతి ఒక్కరు పరిశుభ్ర పర్యాటక ప్రాంతాల పరిశుభ్రతకు సహకరించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనకే పరిమితమవుతుందా..?