ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీఎం జగన్ కు.. హై పవర్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ విషయమై.. కొన్ని కీలక సూచనలు చేసింది. ఆస్పత్రిలో చేరినవారి ఆరోగ్యంపై ఏడాది పాటు అధ్యయనం చేయాలని... వారి ఆరోగ్యంపై ఐసీఎంఆర్‌తో కూడా అధ్యయనం చేయించాలని సూచించినట్లు హైపవర్ కమిటీ ఛైర్మన్, ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ తెలిపారు. పర్యావరణంపై అధ్యయనానికి ఫారెస్ట్ కమిటీ ఏర్పాటుతో పాటు... నీరు, మట్టిపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నివేదికలో స్పష్టం చేశారు.
లీకైంది గ్యాస్ కాదు.. ఆవిరి
పారిశ్రామిక ప్రాంతం వెలుపల కంపెనీలు పెట్టకూడదని.... పర్యావరణానికి కలిగిన నష్టానికి.. పరిహారం లెక్క కట్టాలని చెప్పినట్లు నీరబ్‌కుమార్ తెలిపారు. విశాఖలో అనేక ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయని... ఆ పరిశ్రమలపైనా దృష్టి సారించాలని నివేదికలో కోరామన్నారు. విశాఖలో లీక్ అయ్యింది గ్యాస్ కాదని... ఆవిరి అని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఆవిరి బయటకు వచ్చిందని... ట్యాంకులో 153 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వివరించారు.
జాగ్రత్తలపై అధ్యయనం అవసరం
ఎవరికీ చెప్పకుండానే స్టైరిన్ ట్యాంక్‌లో పైప్ లైన్లు మార్చారని... ఆవిరి ఆపేందుకు ఉపయోగించే రసాయనాలు వాడలేదని నీరబ్ కుమార్ చెప్పారు. పరిశ్రమల్లో తీసుకునే జాగ్రత్తలపై స్టడీ చేయాలని సీఎం కోరినట్టు నీరబ్‌కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రమూ, కేంద్రంలో ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డుల ఏర్పాటుకు హై పవర్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. ప్రతిసారీ హైపవర్ కమిటీ ఏర్పాటు అవసరం రాకూడదన్నారు నీరబ్.
ఇవీ చదవండి:
అడుగడుగునా ఎల్జీ సంస్థ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: హై పవర్ కమిటీ