బురేవి ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని రహదారులు వర్షపు నీటితో నిండుతుండగా.. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రంగనాయకులపేట, జెండా వీధి, నీలగిరి సంగం, సండే మార్కెట్, పొగతోట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి వస్తోంది.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లాలోనూ బురేవి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో వాగులు, వంకలు, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. కొత్త సివంగి, పాత సివంగి, గోళ్ళ కండ్రిగ, సిద్ధిరాజుల కండ్రిగ, గోవర్ధనగిరి గిరిజన కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరణీయర్, కాలంగి జలాశయాల నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధిక మొత్తంలో చేరుతున్నందున సామర్థ్యం మేరకు నీటి నిల్వ చేసుకుని మిగిలిన నీటిని బయటకు పంపుతునట్లు అధికారులు తెలిపారు. వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ జిల్లాలో..
తుపాను హెచ్చరికతో విశాఖ జిల్లా రైతుల్లో కలవరం మొదలైంది. మాడుగుల నియోజవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొద్దిరోజులుగా వాతావరణం అనుకూలించినందున మాడుగుల, చీడికాడ, కే.కోటపాడు, దేవరపల్లి మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మళ్లీ వర్షాలతో అన్నదాతలు కలవరపడుతున్నారు. కోసిన వరి పంటను జాగ్రత్త చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి..