విశాఖలో 12 ఎకరాల విస్తీర్ణంలో పక్కపక్కనే ఉన్న ప్రాంతీయ నేత్ర వైద్యశాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ శిక్షణ కేంద్రాల వివరాలు బిల్డ్ ఏపీ మిషన్ సేకరించింది. ఇక్కడ గజం రూ.లక్షపైనే ఉంది. దీనిని విక్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500-600 కోట్ల వరకు సమకూరుతాయని భావిస్తున్నారు. బిల్డ్ ఏపీ మిషన్ జిల్లా కమిటీ ఈ ప్రతిపాదనలను పంపుతున్నట్లు తెలిసింది.
విశాఖ బస్టాండు నుంచి నడిచివెళ్లే దూరంలో ఈ కార్యాలయాలు ఉండటం అందరికీ అనుకూలంగా ఉంది. రోజూ 500-600 మంది ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఓపీ సేవలు పొందుతున్నారు. వందమంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. ఉద్యోగ నియామకాల సందర్భంగా అవసరమైన పరీక్షలూ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడి కార్యాలయాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేదా ఇతర ప్రాంతాలకు తరలించడంపై అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయ భవనాలు అందుబాటులో లేకుంటే ఇక్కడే వీటి అవసరాలకు తగ్గట్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, మిగిలిన స్థలాన్ని విక్రయించాలని కూడా ఆలోచిస్తున్నారు.
ఇళ్ల స్థలాలు గుర్తించాక..
ఉచిత ఇళ్లస్థలాల కోసం జిల్లాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు భారీ ఎత్తున జరుగుతోంది. దీనివల్ల బిల్డ్ ఏపీ మిషన్‌కు ప్రతిపాదనలపై అవగాహనకు రాలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో బిల్డ్ ఏపీ మిషన్ ఛైర్మన్ సీఎం జగన్‌తో సోమవారం సమావేశమయ్యారు. ఉచిత ఇళ్లస్థలాల గుర్తింపు హడావుడి తగ్గిన తర్వాత జిల్లాల నుంచి వివరాలు తెప్పించి త్వరలో సీఎం అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించాలన్నది అధికారుల ఉద్దేశం. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో విలువైన ప్రభుత్వ భూములు రెండువేల ఎకరాల వరకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో విశాఖలోనే విలువైన భూములు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండీ... ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ