భూముల విక్రయం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ప్రజాసంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడమేనని... మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. వేలం ద్వారా వచ్చిన నిధుల్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉత్తమ న్యాయనిర్ణేత అని అన్నారు. ఆస్తుల వేలం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేటప్పుడు న్యాయపరమైన నియంత్రణను కోర్టులు పాటించాలని పేర్కొన్నారు.
ఆస్తుల వేలంపై చట్టపరమైన నిషేధం లేదని తెలిపారు. ప్రభుత్వం ఆస్తుల్ని వేలం వేస్తే పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు విఘాతం కలదని స్పష్టం చేశారు. వేలం ప్రక్రియపైన దురుద్దేశాల్ని ఆపాదిస్తూ... పిటిషనర్లు ఆరోపణ చేయలేదన్నారు. ఆస్తుల వేలం ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని వివరించారు. సచివాలయాల నిర్మాణం, నవరత్నాల అమలు, తదితర కార్యక్రమాల కోసం భూముల వేలానికి ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. ఇది మొదటిసారి జరుగుతున్న విక్రయం కాదని స్పష్టం చేశారు.
వివిధ రాష్ట్రాల్లోనూ విక్రయం జరిగిందని ఉదహరించారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏకు చెందిన భూముల్ని వేలం వేసి వచ్చిన సొమ్మును ఫ్లైఓవర్లు, మెట్రోరైల్ తదితర నిర్మాణాల కోసం వినియోగించిందని చెప్పారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. విశాఖ, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని సవాలు చేస్తూ... దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కోర్టు ఆదేశాల మేరకు మిషన్ బిల్ట్ ఏపీ డైరెక్టర్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
ఇదీ చదవండీ... చీరాల పోలీసులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల