విశాఖ జిల్లా పెదబయలు మండలం రూఢకోటలో శిశు మరణాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చలించిపోయారు. ఆ గ్రామంలో గడిచిన రెండేళ్లలో 14 మంది శిశువులు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన్యంలోని తల్లుల వ్యథపై నవంబరు 26న ‘ఈనాడు’లో ‘గడప గడపనా గర్భశోకం’ అన్న శీర్షికన కథనంపై గవర్నరు స్పందించారు. ఈ మరణాలకు కారణాలపై నివేదిక ఇవ్వాలని సంబంధితశాఖను ఆదేశించారు. దీంతో విశాఖ కేజీహెచ్ నుంచి వెళ్లిన వైద్యుల బృందం అక్కడ పరిశీలించిన అంశాలతో నివేదిక సమర్పించింది. దానిని గవర్నర్‌కు గిరిజన సంక్షేమశాఖ డైరెక్టరు అందజేశారు.
ఆ నివేదికలో ఏముందంటే...
‘రూఢకోటలో బగత, కొండదొర, పొరజ వంటి పలు జాతులకు చెందిన గిరిజన కుటుంబాలు 138 ఉన్నాయి. మృతి చెందిన శిశువులంతా ఆసుపత్రుల్లోనే పుట్టినప్పుడు శిశువులు సాధారణ బరువున్నారు. తల్లులూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే అక్కడ ఉన్న మంచినీటి పైపులైన్లు తుప్పు పట్టిపోవడంవల్ల నీరు కలుషితమవుతోంది. అలాగే తల్లుల్లో కాల్షియం లోపం ఉన్నట్లు తెలిసింది. దీంతో మంచినీటి పునరుద్ధరణకు, అత్యవసర వైద్య సేవల కోసం రెండో అంబులెన్స్‌ను సమకూర్చేందుకు, విశాఖ కేజీహెచ్ నుంచి వైద్య నిపుణుల బృందాన్ని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో నవజాత శిశువుల ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించేందుకు స్టాఫ్ నర్సును అక్కడే ఉండేలా చూస్తున్నాం. ఈ గ్రామంలోని బాలింతలు వారి నవజాత శిశువులతోపాటు ముంచింగిపుట్టులో ఉండేందుకు ఏర్పాట్లు చేశాం. అక్కడే గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేశాం’ అని నివేదికలో వివరించారు. గిరిజన ప్రాంతాల పాలనాధికారి హోదాలో గవర్నర్ వీటిపై స్పందిస్తూ.. అక్కడ శిశు మరణాల నియంత్రణకు పీహెచ్‌సీ సిబ్బందిని 24గంటలూ అందుబాటులో ఉంచాలని, ఇలాంటి మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రూఢకోటలో ఇదీ పరిస్థితి
రూఢకోటలో తల్లులకు కడుపులో బిడ్డ పడగానే మరణ గండం ఎదురవుతోంది. నేలపైకి వచ్చిన నెలల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నారు. 2019లో ఆరుగురు, గతేడాది 3 నుంచి 6 నెలల చిన్నారులు 8 మంది చనిపోయారు. ఒకే ఇంటిలో ఇద్దరు శిశువులను పోగొట్టుకున్న కుటుంబాలున్నాయి. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తూనే నిమిషాల వ్యవధిలో మార్పులు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యవహారంపై ఇటీవల అయిదుగురు సభ్యులతో కూడిన వైద్య నిపుణుల బృందం ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించింది. కడుపు ఉబ్బి, వాంతులు అయిన తరువాత చనిపోతున్నట్లు తల్లులు వీరికి చెప్పారు. వాంతులయ్యే సమయంలో కొంత నీరు ఊపిరితిత్తుల్లో చేరి ఊపిరాడక చనిపోయి ఉండొచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
పీహెచ్‌సీలో సమస్యలెన్నో..
రూఢకోటను ఆనుకునే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఉంది. రెండేళ్లుగా ఈ గ్రామంలో శిశు మరణాలు వరుసపెట్టి జరుగుతున్నా పీహెచ్‌సీలో కనీస సదుపాయాలను కల్పించలేకపోయారు. తాగడానికి మంచినీరు లేదు. ఈ సమస్యను పరిష్కరించకుండా సీఎస్‌ఆర్ నిధులతో రూ.2.90 లక్షల విలువైన ఆర్వో ప్లాంటును పీహెచ్‌సీకి ఇచ్చారు. బోరు పాడవటంతో నీరులేక ఈ ఆర్వో ప్లాంటు నిరుపయోగంగా ఉంది. పీహెచ్‌సీ అంబులెన్స్ ఆగితే కదలదు.. తోయాల్సిందే. గ్రామానికి రెండు దశాబ్దాల క్రితం నాటి గ్రావిటీ పైపులైనుతో నీటిని సరఫరా చేస్తున్నారు. నీరు కలుషితమవుతోంది. దీనిపై డీఎంహెచ్‌వో తిరుపతిరావు మాట్లాడుతూ... వైద్య నిపుణులు సూచించిన అంశాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
PV Sindhu At Simhachalam Temple: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పీవీ సింధు