విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణంతో ఆ ప్రాంతంలో జీడీపీ ఆరురెట్లు పెరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోంప్రకాశ్ తెలిపారు.రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. ‘‘ఈ కారిడార్ ప్రధాన ఉద్దేశం పారిశ్రామిక ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెంచి ఉత్తమమైన జీవన ప్రమాణాలు, సామాజిక స్థితిగతులు అందించడమే. ఏపీ చేసిన ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం ఈ ప్రాజెక్టువల్ల ఆ ప్రాంత జీడీపీ ఆరురెట్లు పెరగనుంది. 2015లో రూ.2 లక్షల కోట్లమేర ఉన్న అక్కడి జీడీపీ 2035 నాటికి రూ.11.60 లక్షల కోట్లకు చేరుతుంది’’ అని సోంప్రకాశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద శ్రీకాళహస్తి, విశాఖపట్నం నోడ్స్‌ని చేర్చాలని 2018 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ 2019 ఆగస్టు 30న ఆమోదించినట్లు చెప్పారు. విశాఖపట్నానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినట్లు చెప్పారు. కడప నోడ్‌కు సంబంధించి కన్సల్టెంట్ నియామకం జరిగిందన్నారు.
* బెంగుళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.2,139.44 కోట్లతో (భూమితో కలిపి) కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి డిసెంబర్ 30న కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.
* హైదరాబాద్-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నోడ్‌ను అభివృద్ధి చేయాలని 2020 ఆగస్టు 19న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే ప్రీప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.
* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడో దశ కింద ఆంధ్రప్రదేశ్‌కు 3,285 కిలోమీటర్ల రహదారి నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. దీన్ని 6,135 కిలోమీటర్లకు పెంచాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించడం సాధ్యంకాదని స్పష్టంచేశారు. వైకాపా సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానీ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
* కంభం-ప్రొద్దుటూర్ మధ్య 142.28 కి.మీ.ల రైల్వేలైన్ నిర్మాణ వ్యయంలో 50% సమకూర్చే విషయంలో రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు.వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులను చేపట్టలేదన్నారు.
ఇదీ చదవండి: విశాఖ జోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితేం లేదు: కేంద్రం