INDUSTRIES: పరవాడ ఫార్మాసిటీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీకర్ ఫార్మాలో 2016లో గ్యాస్ లీకై ఒకరు మృతిచెందగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు. అజికో బయోఫోర్‌లో 2017లో ఐదుగురు మృతిచెందారు. స్మైలెక్స్ ల్యాబొరేటరీస్‌లో 2019లో ఇద్దరు చనిపోగా, విజయశ్రీ ఆర్గానిక్స్‌లో ప్రమాదంలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2020లో ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌లో ఇద్దరు మృతిచెందారు. గాఢమైన రసాయన వాసనలు రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయినార్ ఫార్మాలో 2020లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంకీ పంప్‌హౌస్‌లో 2022లో ఇద్దరు చనిపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 19 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు, 192 ప్రమాదకరమైన పరిశ్రమలు 56 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి.
విశాఖ ఎల్.జి.పాలిమర్స్‌లో 2020 మే 7న స్టైరీన్ రసాయనం నుంచి వెలువడిన ఆవిర్ల వల్ల 12 మంది మృతిచెందారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేసింది. మరికొందరు నిపుణులతోనూ ఈ కమిటీ విచారణ చేయించింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు జాగ్రత్తలపై కమిటీ సిఫార్సులు చేసింది. వీటిని పారిశ్రామిక సంస్థలు బుట్టదాఖలు చేస్తున్నాయన్న విమర్శలున్నాయి.
ఎల్.జి.పాలిమర్స్ ప్రమాదం అనంతరం ఉమ్మడి విశాఖలో అత్యంత ప్రమాదకర, ప్రమాదకర, రెడ్ కేటగిరిలో ఉన్న 267 పరిశ్రమలను అధికారుల బృందం తనిఖీ చేసింది. 121 సంస్థల్లో లోపాలున్నట్లు గుర్తించి నోటీసులిచ్చింది. 29 సంస్థలపై కేసులు పెట్టింది. ఎల్.జి. పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన ట్యాంకు దశాబ్దాల కిందటిదని, దాని పైపులైను వ్యవస్థను సరిచేసుకోవాలని సిఫార్సు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 92 ఫార్మా పరిశ్రమలున్నాయి. ప్రతి పరిశ్రమ, సంస్థ చట్టప్రకారం ‘సేఫ్టీ ఆడిట్లు’ నిర్వహించాలి. ఈ ఆడిట్లను ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తుండడంతో పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయి.
దశాబ్దాల కిందటి పరిశ్రమల్లో కొందరు వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను నవీకరించుకోవడం లేదు. ప్రమాదాలు జరగకుండా హెచ్చరించే అత్యాధునిక ‘ఆటోమేషన్’ వ్యవస్థ’ అందుబాటులోకి వచ్చినా వినియోగించుకోవడం లేదు. వివిధ రసాయనాలను నిల్వ చేయడంలోనూ జాగ్రత్తలు పాటించడం లేదు. ఫార్మా సంస్థల్లోని ఔషధాల తయారీలో భాగంగా రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద రసాయన ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదమే. పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఆయా రియాక్టర్లకు అమర్చిన ‘ప్రెజర్‌వాల్వ్’లు వాటంత అవే తెరచుచునే వ్యవస్థలుంటాయి.
ఒక్కోసారి అవి పనిచేయక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఔషధాల తయారీలో కొన్ని సాల్వెంట్లను పదేపదే వాడుతున్నారు. ఫలితంగా అవి కలుషితమై రసాయన ప్రక్రియలు వికటిస్తున్నాయి. తక్కువ వేతనాలకు వస్తున్నారన్న ఉద్దేశంతో పరిశ్రమల్లో వివిధ యంత్రాల వద్ద అర్హతలు లేని వారిని నియమిస్తున్నారు. పకడ్బందీ తనిఖీలకు పరిశ్రమల శాఖలో అధికారులు, సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది. ప్రమాదాలు జరిగితే ప్రాథమిక దశలో నియంత్రణపై కొందరు ఉద్యోగులకు అవగాహన ఉండడం లేదు.
ఇవీ చదవండి: