RK Beach Incident: విశాఖ అందాలు తిలకిద్దామని వచ్చిన రెండు విద్యార్థి బృందాల విహారయాత్ర విషాదయాత్రగా మారింది. స్థానిక పరిస్థితుల మీద అవగాహన లేకపోవడమో.. లేక సముద్ర లోతును గుర్తించకపోవడమో.. కారణం ఏదైనా ఇద్దరు విగతజీవులుగా మారగా.. మరో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. విశాఖ ఆర్కేబీచ్, పాండురంగాపురం తీరాల్లో చోటు చేసుకున్న విషాద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ బేగంపేటకు సమీపంలోని రసూల్‌పురకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల బృందం విశాఖలో నూతన సంవత్సర వేడుకలు చూద్దామని డిసెంబరు 31న వచ్చారు. స్థానికంగా ఒక లాడ్జిలో దిగారు. రెండ్రోజులు నగరంలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లాడ్జిని ఖాళీ చేశారు. సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఉదయం హార్బర్‌వైపు వెళ్లి, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న తీరానికి చేరుకున్నారు. ఒక యువకుడిని లగేజీ వద్ద ఉంచి మిగతా ఏడుగురు సముద్ర స్నానానికి దిగారు. కాసేపు అలల మధ్య సరదాగానే గడిపారు. ఈ ఏడుగురిలో సి.హెచ్ శివ(24), కె.శివకుమార్(21), మహమ్మద్ అజీజ్ (22) సముద్రంలో ఇంకాస్త ముందుకు వెళ్లారు. ఈలోపు పెద్ద అల ఈ ముగ్గుర్నీ మరింత లోనికి నెట్టేసింది. తీరంలో ఉన్న గజ ఈతగాళ్లు గుర్తించి వీరిని రక్షించే ప్రయత్నం చేయగా.. కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ దొరకలేదు. సి.హెచ్.శివను మాత్రం ఒడ్డుకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటనతో స్నేహితుల బృందం కన్నీటిపర్యంతమైంది.
ఒడిశా నుంచి వచ్చి విగతజీవిగా మారి..: మరో విద్యార్థి బృందం కూడా విశాఖలో నూతన సంవత్సర వేడుకలు చేసుకుందామని ఒడిశా రాష్ట్రం బద్రక్ జిల్లా నుంచి నగరానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఐదుగురు విద్యార్థుల బృందం పాండురంగాపురం తీరానికి వచ్చారు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా సుశ్మిత త్రిపాఠి (21) కెరటం ధాటికి లోపలకు వెళ్లిపోయింది. గుర్తించిన గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకి ఆమెను ఒడ్డుకు చేర్చారు. వెంటనే కేజీహెచ్‌కు తరలించగా.. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న ఏసీపీ హర్షిత, సి.ఐ కోరాడ రామారావు, ఎస్సైలు ధర్మేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మెరైన్, నేవీ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మెరైన్ బృందం గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. మృతిచెందిన వారిని మార్చురీకి తరలించారు.
ఇదీ చదవండి :
రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం అధికారి ఆత్మహత్య