విశాఖ జిల్లా నాతవరం మండలం బమిడికిలొద్దిలోని ఓ వివాదాస్పద లేటరైట్ క్వారీ అది. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లో విచారణ జరుగుతోంది. ఇదివరకు వివిధ శాఖల అధికారుల బృందం ఒకసారి పరిశీలించింది. కొంతకాలంపాటు తవ్వకాలను నిలిపారు. మళ్లీ మూడు నెలల నుంచి యథాతథంగా భారీఎత్తున తవ్వేస్తున్నారు. కొత్తవారిని అటుగా వెళ్లడానికి అనుమతించడం లేదు. ‘ఈనాడు ,ఈటీవీ-భారత్’ ప్రతినిధులు తవ్వకాల పరిశీలనకు వెళ్లగా.. ఎలాంటి అక్రమాలు లేవంటూనే నిర్వాహకులు క్వారీ పరిసరాల్లోకి వెళ్లనీయలేదు.
అటు వెళితే సమస్యలొస్తాయ్!
క్వారీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శనివారం ‘ఈనాడు, ఈటీవీ-భారత్ ప్రతినిధులు’ క్షేత్ర పరిశీలనకు వెళ్లారు. తవ్వకాలు జరిగే ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల ముందే కొందరు అడ్డగించారు. అప్పటికే ఆ రోడ్డుపై లేటరైట్‌తో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. అందులో ఒకటి దారి మధ్యలోనే ఆగిపోయింది. వాహనాలను ఫొటో తీయడానికి ప్రయత్నిస్తే, ‘ఇక్కడ ఎలాంటి ఫొటోలు తీయకూడదు.. ఇది మా పరిధిలో ఉన్న ప్రాంతం’ అంటూ క్వారీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి గద్దించాడు. మళ్లీ మెత్తబడి ‘గ్రామంలోకి రండి అన్నీ మాట్లాడుకుందాం’ అంటూ సలహా ఇచ్చాడు. మేం గ్రామంలోకి రాలేమని.. సార్లాంక, పైడిపాల మీదుగా రౌతులపూడి వెళ్లిపోతామని ‘ఈనాడు, ఈటీవీ-భారత్ ’ ప్రతినిధులంటే.. ‘అటుగా వెళ్లడానికి వీల్లేదు. మీరు విశాఖ నుంచి వచ్చారు కదా. ఇటు నుంచి ఇటే వైజాగ్ వెళ్లిపోండి. అటు వెళితే సమస్యలొస్తాయి’ అని మళ్లీ హెచ్చరించాడు. ఇదేమైనా నిషిద్ధ ప్రాంతమా మమ్మల్ని ఎందుకు నిలువరిస్తున్నారంటూ ధిక్కరించి రౌతులపూడి వైపు వెళ్లగా క్వారీ మనిషి ఒకరు ‘ఈనాడు’ ప్రతినిధులను వెంబడించారు. డంపింగ్ యార్డ్ దగ్గర పది మంది క్వారీ మనుషులు దారికాశారు. ఇటుగా రావొద్దని మీ మార్గం అటువైపు ఉందని చూపించి పంపించారు. ఇలా.. ఈ ప్రాంతానికి ఎవరైనా కొత్తవారు వస్తే తమకు వెంటనే సమాచారం అందడానికి అయిదారు కిలోమీటర్ల ఇవతలే క్వారీ నిర్వాహకులు ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ సొంత సామ్రాజ్యంలా మార్చుకున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు సహకారం అందించడంతోపాటు చుట్టుపక్కల గ్రామస్థులకు నెలవారీ తాయిలాలు ఇస్తున్నారు. ఆయా ఊళ్లలో జరిగే అన్ని శుభకార్యాల ఖర్చులనూ వీళ్లే భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గనుల శాఖ ఆర్‌ఐ ఒకరు తనిఖీ కోసం వెళ్లగా.. ‘ఇది ఎవరి క్వారీయో తెలిసే పంపించారా..?’ అని హెచ్చరిస్తూ సంబంధిత అధికారిని వారే బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
* ఒకవైపు కేసు విచారణ జరుగుతుండగానే లక్షల క్యూబిక్ మీటర్ల లేటరైట్ తరలించుకుపోతున్నారని క్వారీపై ఎన్‌జీటీలో ఫిర్యాదు చేసిన కొండ్రు మరిడియ్య ఆరోపిస్తున్నారు. ఇటీవల తెదేపా నేతలు కూడా తవ్వకాలను తప్పుపట్టారు. ఎన్‌జీటీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండానే తవ్వకాలను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు మాత్రం రేయింబళ్లూ భారీ వాహనాలలో లేటరైట్‌ను తరలించి, యార్డులో నిల్వ చేస్తుండటం గమనార్హం.
ఇదీ చదవండి: 'చెట్ల కూల్చివేతకు అనుమతి లేదు' : అటవీ అధికారుల వివరణ