‘ప్రతి నెలా వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఏప్రిల్ వేతనం ఇప్పటికీ ఇవ్వలేదు. బ్యాంకుల్లో ఈఎంఐలు ఎలా చెల్లించాలి? నిధుల కేటాయింపు చెక్కు వచ్చినా ఇక్కడే ఉంచారు. ట్రెజరీకి పంపిస్తే ఇంకెన్ని రోజులు పడుతుందో..? వేతనం ఎప్పుడు వస్తుందంటే సమాధానం చెప్పలేకపోతున్న మీరు ఆ సీట్లో ఉండడం ఎందుకు? వైదొలగండి’
ప్రకాశం జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారిని (డీసీహెచ్‌ఎస్) చీరాల ఏరియా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యురాలు నిలదీసిన తీరిది. ఈ నెల 17న ఒంగోలులో జరిగిన ఈ ఘటన వేతనాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆవేదనను వెల్లడిస్తోంది.
మరో పది రోజుల్లో మే నెల ముగియబోతున్నా.. విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు అందలేదు. మిగతా జిల్లాల వారికీ వారం కిందటే అందాయి. నెల పూర్తవుతున్నా ప్రభుత్వం చెల్లింపులు ఎందుకు చేయడం లేదని వైద్యులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూడు జిల్లాల్లోని సుమారు 2,500 మందికి రావాల్సిన రూ.8 కోట్లల్లో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల విభజన జరిగినప్పటికీ ఆర్థికపరమైన అంశాలు ఇంకా పాత జిల్లాల లెక్కల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఇతర శాఖల ఉద్యోగులకు 010 పద్దు ద్వారా చెల్లిస్తున్నారు. దీనిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంవల్ల ఆ ఉద్యోగులు సకాలంలో జీతాలు అందుకుంటున్నారు. వైద్య విధాన పరిషత్తులో మాత్రం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ విధానంలో ప్రతి 3 నెలలకోసారి నిధులు కేటాయిస్తున్నారు. జిల్లా అధికారులు ట్రెజరీలో ఉద్యోగుల వేతన బిల్లులు పెడితే, ఉన్నతస్థాయిలో ఆమోదిస్తే ఉద్యోగుల ఖాతాలకు పీడీ ఖాతా ద్వారా జమ అవుతున్నాయి.
ఈ ప్రక్రియలో ప్రతినెలా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో వైద్య విధాన పరిషత్తు పరిధిలోని రెగ్యులర్ ఉద్యోగులు 5,732, ఒప్పంద ఉద్యోగులు 2,436, పొరుగుసేవల సిబ్బంది 1,828 మంది నెలనెలా ఖాతాలో వేతనం ఎప్పుడు పడుతుందోనని ఎదురు చూడాల్సి వస్తోంది.
ట్రామాకేర్ వారికి జనవరి నుంచి.. వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలోని ట్రామాకేర్ సెంటర్లలో పనిచేసే సుమారు 100 మందికి జనవరి నుంచి చెల్లింపులు జరగడం లేదు. ఈ కేంద్రాలు టెక్కలి, తుని, రాజమహేంద్రవరం, ఏలూరులో ఉన్నాయి. ఇంతకుముందు 9 నెలలవి ఒకేసారి అందాయి. 108, 104 సిబ్బందికీ 2 నెలల నుంచి చెల్లింపులు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే వెంటనే చెల్లిస్తామని వీటి యాజమాన్యం చెబుతోంది.
ఇదీ చదవండి: