నిరుపేద, నిరుద్యోగ ఎస్సీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి.. జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి పథకం (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) కింద.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై ఇచ్చే ఇన్నోవా కార్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేకుండా పోయింది. కార్పొరేషన్ 63శాతం రాయితీ ఇస్తుంది. మిగిలిన దాంట్లో 2 శాతం లబ్ధిదారుడి వాటా కాగా, 35శాతం బ్యాంకు రుణం ఉంటుంది.
ఈ కార్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినా... ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపేసింది. ఆరు నెలలు గడుస్తున్నా పంపిణీపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. పై నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే తాత్కాలికంగా నిలిపేసినట్లు క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు.
నిరుద్యోగుల ఎదురుచూపు.. ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాన్ని మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ఎస్సీలకు 110 కార్లు అందించేలా అధికారులు గతేడాది డిసెంబర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటికి జిల్లాల విభజన కానందున 13 జిల్లాల ప్రాతిపదికగా నోటిఫికేషన్ ఇచ్చారు.
- గుంటూరు జిల్లాకు 13, తూర్పుగోదావరి, కృష్ణాకు 12 చొప్పున, ప్రకాశం జిల్లాకు 11, పశ్చిమగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు 10 చొప్పున, నెల్లూరు 9, అనంతపురం 8, కడప 6, విశాఖకు 4, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 3 చొప్పున కేటాయించారు. ఇప్పుడు 13 జిల్లాలు 26గా మారాయి. అప్పట్లోనే కొన్ని జిల్లాల్లో వీటి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. చిత్తూరు, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేశారు.
- పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అప్పట్లోనే ఇంటర్వ్యూ తేదీలు ఖరారు చేశారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వారు, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు..
నిలుపుదలకు కారణం ఏంటి?.. ఎస్సీలకు సంబంధించిన వివిధ పథకాల అమలులో జీవో నంబర్ 25 కీలకంగా ఉంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీల్లోని ఉపకులాల జనాభా ప్రాతిపదికన పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాయితీపై ఇన్నోవా కార్ల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ జిల్లాలకు ఇచ్చిన ఆదేశాల్లో జీవో 25ను కోట్ చేయలేదు. అయితే ఈ జీవోను ప్రాతిపదికగా తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి.
దీని ఆధారంగా పంపిణీ కష్టతరంగా మారుతుందన్న ఆలోచనతోనే తాత్కాలికంగా ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే దరఖాస్తులు భారీగా రావడంతో ఎంపిక కష్టతరమవుతుందనే భావనతో ప్రక్రియను ఆపినట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఇవీ చూడండి: