టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అధికారులు, ఇస్రో ఆధ్వర్యంలో సైంటిఫిక్ పరిశోధనల నిమిత్తం 10 బెలూన్ ఫ్లయిట్స్‌ను ఈనెల పది నుంచి 30వ తేదిలోగా ఆకాశంలోకి వదలనున్నారు. వీటిలో హైడ్రోజన్ వాయువును నింపుతారు. వాటితో పాటు పరిశోధనలకు అవసరమైన పరికరాలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొదటి బెలూన్‌ను ఈనెల మూడో వారంలో ఆకాశంలోకి వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
ఇవి సాధారణంగా రాత్రి సమయంలో ప్రారంభిస్తారు. భూమి నుంచి 30 నుంచి 42 కి.మీ. ఎత్తులో వీటిని పరిశోధనల నిమిత్తం నింగిలోకి వదిలారు. ఒక్కోబెలూన్‌లో అమర్చిన సైంటిఫిక్ పరికరాలు 10గంటల పరిశోధనల తర్వాత భూమిపైకి దిగుతాయి. రంగురంగుల ప్యారాచూట్‌లలో ఇవి కింది దిగే అవకాశం వుంది. ఈబెలూన్‌లు హైదరాబాద్ నగరానికి 200 నుంచి 350కి.మీ. దూరంలో భూమి పైకి చేరుకుంటాయి. విశాఖపట్నం, హైదరాబాద్, షోలాపూర్, నార్త్‌కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇవి కిందికిదిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముట్టుకోకుండా... సమాచారమివ్వండి
ఇవి ఎవరికైనా కనిపిస్తే వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరించారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు కానీ, వాటిపై ఉన్న చిరునామాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాటిలోని పరికాలను తాకొద్దని... అందులోని కొన్ని పరికరాల్లో హై ఓల్టేజ్ విద్యుత్ ప్రవహిస్తుందన్నారు. చాలా సున్నితమైన, విలువైన సైంటిఫిక్ డేటా అందులో ఉంటుందని, ఎవరైనా దానిని తెరిస్తే డేటా చెదిరిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని, దానికి ఎలాంటి పారితోషికం ఉండదని అన్నారు.
ఇదీ చదవండి:మూడు ముక్కలుగా రాష్ట్ర రాజధాని