రాష్ట్ర రాజధాని ఎక్కడ అనేది ఎందుకు స్పష్టంగా సీఎం జగన్ చెప్పలేక పోతున్నారని జనసేన పరిపాలన వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు ఎందుకు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంటే... తగిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కోట్ల రూపాయలు వెనక్కు వెళ్లిపోయాయని ఆరోపించారు. విశాఖలో సోమవారం నిర్వహించిన జనసేన ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నేతను అడ్డుకోవటం దారుణమని అన్నారు. ఈ ఘటనలో పోలీసులు తీరు అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాతో కలిసి జనసేన పోటీ చేస్తోందని పునరుద్ఘాటించారు. విశాఖ జిల్లాలో బలవంతపు భూసేకరణ జరుగుతోందని... బాధిత రైతులకు జనసేన అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఇదీ చదవండి