విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమపై చిన్నచిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారించడం ఎంత వరకూ సబబని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. బాధితులకు దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలొస్తాయనేది పరిశీలించడం లేదని.. ఆరు నెలల తర్వాత వారి జీవితాలు అంధకారమైతే ఎవరు బాధ్యులు? అని నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చెట్లెందుకు మాడిపోయాయి?
‘‘విషవాయువు తీవ్రత అధికంగా లేకపోతే చెట్లెందుకు మాడిపోయాయి? మూగజీవాలు ఎందుకు చనిపోయాయి? వాయువు ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ద్వారా అధ్యయనం చేయించాలి. స్థానికుల ఆరోగ్య రికార్డులు తయారు చేసి చికిత్స అందించాలి. ఈ విషయాలన్నింటిపై ప్రధానికి లేఖ రాస్తా. వాస్తవాల అధ్యయనానికి పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పలతో కూడిన త్రిసభ్య బృందాన్ని విశాఖ పంపిస్తున్నాం.
మానవ తప్పిదమా?
ప్రమాద ప్రభావం అధికంగా ఉండటంతోనే.. ఘటనపై హైకోర్టు, మానవ హక్కుల సంఘం తక్షణం స్పందించాయి. ప్రధాని స్వయంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ.50 కోట్లు డిపాజిట్ చేయమని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. గురువారం విశాఖపట్నానికి వెళ్లిన జగన్.. చనిపోయిన వారికి రూ.కోటి ఇస్తాం. ఎల్‌జీ సంస్థ డబ్బులిస్తే తీసుకుంటాం. లేదంటే మేమే ఇస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్‌జీ పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చేలా చూస్తాం. పరిశ్రమను తరలించే అంశాన్ని పరిశీలిస్తామంటూ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకొని మాట్లాడటం సరికాదు. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక ప్రమాదమా? అనే అంశాలపై లోతైన విచారణ చేయాలి. దీంతోపాటు ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను మూసేయాలి. లేదా జనసాంద్రత లేని చోటుకు తరలించాలి.
ఐఏఎస్‌లు రసాయనశాస్త్ర ఇంజినీర్లా?
విచారణకు అయిదుగురు ఐఏఎస్‌లు ఎందుకు? వారేమైనా రసాయన శాస్త్ర ఇంజినీర్లా? సీఎం చాలా విషయాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇటీవల కరోనా విషయంలోనూ పారాసెటమాల్, బ్లీచింగ్ పొడి సరిపోతుందన్నారు.
ఏం చేయలేకపోయానని బాధగా ఉంది
విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ విషయం తెలియగానే అక్కడకు వెళ్లడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశా. ఇంకా చేస్తూనే ఉన్నా. నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోయానని బాధగా ఉంది.
వారిని సైకోలనాలా?
ప్రమాద ఘటన కుట్రకోణమని, రాజధాని రాకుండా అడ్డుకునేందుకు తెదేపా చేసిందని మాట్లాడుతున్న వారిని సైకోలు అనాలా? దుర్మార్గులు అనాలా? మద్యం దుకాణాలు తెరచినప్పుడూ.. తెదేపా కార్యకర్తల్ని పంపారని అడ్డగోలు ఆరోపణలు చేశారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
యడియూరప్పకు ధన్యవాదాలు
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చిక్కుకున్న 300 మందికి పైగా ఏపీకి చెందిన మత్స్యకారులకు..తన విజ్ఞప్తి మేరకు సహాయం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన స్పందించినందుకు ఉడుపి ఎంపీ శోభా కరందాజ్లేకు కృతజ్ఞతలు తెలిపారు. ఉడుపి నుంచి బయల్దేరిన వారిని ఇబ్బందుల్లేకుండా వారి స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వ సాయం తీసుకోవాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి సూచించారు.
రైలు ప్రమాద ఘటన కలచివేసింది..
పలువురి ప్రాణాలను బలిగొన్న ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటన తన మనసును కలచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి