ప్రభుత్వం పర్యటకశాఖకు కేటాయించిన భూమిలో ఎక్కువ భాగం ఖాళీగానే ఉంది. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లో ప్రస్తుతానికి 411.29 ఎకరాలు ఖాళీగా ఉంటే 155.04 ఎకరాల్లో మాత్రమే ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. పాడేరు డివిజన్‌లో 90 ఎకరాలకు 64.22 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇప్పటికైనా మిగిలిన భూమిని కొత్త ప్రాజెక్టుల కోసం సద్వినియోగం చేసుకోవాలి.
ఎకరాల్లో..
పర్యటకశాఖకున్న మొత్తం భూమి : 656.43
ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమి : 475.51
రక్షణ కంచె ఏర్పాటుకు గుర్తించిన భూమి :167
పర్యాటక ప్రాజెక్టులు ఉన్నవి : 120.41
పీపీపీ ప్రాజెక్టులకు కేటాయించింది : 60.51
చిక్కుల్లో భూములు...
కోర్టు వివాదాల్లో.. నగర పరిధిలో పర్యటక శాఖకు చెందిన కొన్ని భూములు కోర్టు వివాదాల్లో సాగుతున్నాయి. రుషికొండ, చేపలుప్పాడ, కాపులుప్పాడల్లో ఉన్న భూములు రూ.కోట్ల విలువ పలుకుతున్నాయి. గతంలో రెవెన్యూ శాఖ వాటిని అప్పజెప్పింది. వీటిపై అయిదు కేసులు న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. భీమిలి మండలం కాపులుప్పాడ, చేపలుప్పాడలో పర్యటకశాఖకు అప్పగించిన భూమి ప్రైవేటు వ్యక్తులు అనుభవదారులమంటూ కోర్టుల్లో కేసులు వేశారు. అలాగే రుషికొండ వద్ద హరితా రిసార్టుకు వెళ్లే మార్గానికి ఆనుకొని ఉన్న స్థలం పర్యాటకశాఖదైనప్పటికీ ఓ ప్రైవేటు వ్యక్తి ఆక్రమణలో ఉండగా ప్రస్తుతం దానిపైనా కేసు నడుస్తోంది. సుమారు 35 ఎకరాల భూమి న్యాయపరమైన చిక్కుల్లో ఉండిపోయాయి.
పురోగతి లేదు...
కరోనా కారణంగా ప్రస్తుతం ఈ కేసుల్లో ఎటువంటి పురోగతిలేదు. ఇప్పటికే జిల్లా అధికారులు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పర్యటకశాఖ న్యాయపరమైన అంశాలు చూసే అధికారులకు అప్పగించారు. పర్యటకశాఖలో ఎస్టేట్ విభాగం లేకపోవడం భూములకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిర్వహించడం కష్టంగా మారుతోంది. డిప్యూటేషన్ మీద వచ్చే అధికారులు అవగాహన తెచ్చుకునేసరికి పరిస్థితులు చేదాటిపోతున్నాయి. చిక్కుల్లో ఉన్న భూమిని దక్కించుకోకపొతే రూ.కోట్ల విలువ చేసే ఆస్తిని పర్యాటకశాఖ కోల్పోయినట్లు అవుతుంది.
ఇంజినీరింగ్ అధికారుల కసరత్తు..
జియో మ్యాపింగ్..రక్షణ ఏర్పాట్లు..నగర పరిధిలో పర్యటకశాఖ భూముల పరిరక్షణకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. యండాడ, కాపులుప్పాడ, మధురవాడ, చేపలుప్పాడ, పూడిమడక, మధురవాడ ప్రాంతాల్లో పర్యాటకశాఖకు విలువైన భూములున్నాయి. వీటిని పరిరక్షించుకునేందుకు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కచ్చితమైన అంచనాలతో తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించడంతో ప్రస్తుతం పర్యటకశాఖ ఇంజినీరింగ్ అధికారులు అదే కసరత్తులో ఉన్నారు.
రక్షణకు ప్రత్యేక చర్యలు
విశాఖలోని పర్యటకశాఖకు చెందిన కోర్టు వివాదాల్లో ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టిసారించాం. ఇప్పటికే వీటికి సంబంధించిన ఆధారాలు, నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాం. బలమైన వాదనలు వినిపించేలా వివరాలు ఇచ్చాం. కొవిడ్ కారణంగా కేసులపై పురోగతి లేదు. భూముల సర్వే దాదాపు పూర్తయ్యింది. నగర పరిధిలో భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. - పూర్ణిమాదేవి, జిల్లా పర్యటక సమాచార అధికారి
ఇదీ చదవండి