విశాఖలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కు అభివృద్ధికి భూమి వరల్డ్ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. భాగస్వామ్య విధానంలో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. సుమారు రూ.2,500 కోట్ల పెట్టుబడులతో 20వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. 100 ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో పేర్కొంది.
ఈ సంస్థ ఇప్పటికే మహారాష్ట్రలోని భివండీలో 50 లక్షల చదరపు అడుగుల్లో రెండు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో పార్కు అభివృద్ధికి చేసిన ప్రతిపాదనపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్, రాష్ట్ర మారిటైం బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం సమీక్షించారు. ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
ఇదీ చదవండి: