శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం విశాఖ వచ్చాడు. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత నూతన్‌నాయుడి ఇంట్లో 4 నెలల కిందట పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. అయితే... తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిచారు. దీనిగురించి అతన్ని నిలదీయగా... 'మీరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోండి' చెప్పి అతను వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం తమ సూపర్‌వైజర్ ద్వారా యువకుడిని మరోసారి ఇంటికి పిలిచారు. నూతన్‌నాయుడి భార్య, ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది అతణ్ని గట్టిగా నిలదీశారు. సెల్‌ఫోన్ దొంగిలించినట్లు అంగీకరించకుండా ఎదిరించాడన్న కోపంతో క్షురకుడిని పిలిపించి అతనికి గుండు కొట్టించారు.
ఈ కేసులో నూతన్‌నాయుడు భార్య మధుప్రియ సహా మరో ఏడుగురిపై కేసు నమోదు చేశాం. ఐ-ఫోన్ చోరీ నెపంతో యువకుడిని ఇంటికి పిలిచి శిరోముండనం చేశారు. దాడి వెనక నూతన్‌నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నాం. మధుప్రియ చూస్తుండగానే బ్యూటీషిషన్ ఇందిర శ్రీకాంత్‌ను దారుణంగా హింసించింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయనున్నాం. ఐ-ఫోన్ చోరీ కాకుండా దాడి వెనుక ఇతర కారణాలపై విచారణ సాగిస్తాం. -మనీష్‌కుమార్ సిన్హా, విశాఖ సీపీ
వెంటనే స్పందించిన పోలీసులు...
ఈ ఘటనపై విశాఖ పోలీసులు వేగంగా స్పందించారు. బాధితుడు ఫిర్యాదు చేయగానే పెందుర్తి పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ సేకరించారు. నూతన్‌నాయుడు భార్య మధుప్రియ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఫోన్ విషయమే కాకుండా ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు కారణం... ఫోన్ పోవడమే కారణమా..? దీంట్లో నూతన్‌నాయుడు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
మా ఇంట్లో ఆ యువకుడితో పాటుమరో యువతి పనిచేస్తోంది. ఆమె సెల్‌ఫోన్‌లోని చిత్రాలను అతను తీసుకోవడంతోపాటు స్నేహితులకు పంపి వేధిస్తున్నాడని తెలిసింది. యువతి ఈ విషయాన్ని మాకు చెప్పింది. దీనిపై ప్రశ్నించడానికి యువకుడిని ఇంటికి రమ్మన్నాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే.. వద్దని బతిమాలాడు. చేసిన తప్పునకు శిక్షగా తనకు గుండు కొట్టించాలని చెప్పి, క్షురకులను ఇంటికి తీసుకొచ్చి అతనే గుండు కొట్టించుకున్నాడు. -నూతన్‌నాయుడు
ఒకవేళ నిజంగానే నేను సెల్‌ఫోన్ దొంగిలిస్తే.. వారు పిలవగానే ఎందుకు వెళ్తాను. నన్ను అడిగినప్పుడు కూడా మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పాను. నేను ఎవరి చిత్రాలు తీసుకోలేదు.. ఎవరికీ పంపలేదు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చెబుతున్నారు. నన్ను తీవ్రంగా కొట్టారు. నాకు గుండు గీయించిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బెదిరించారు. కానీ మీడియా ఇచ్చిన ధైర్యంతో నాకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాను. నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. - బాధితుడు
ఇదీ చదవండీ... విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!