విశాఖ జీవీఎంసీ 28వ వార్డు పరిధిలోని సచివాలయాన్ని మేయరు గొలగాని హరి వెంకట కుమారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యదర్శుల హాజరుపట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్, ప్రజల అర్జీలను పరిశీలించారు. కార్యాలయంలో అడ్మిన్ సీహెచ్ సురేంద్ర, సంక్షేమ కార్యదర్శి రిషిత ప్రియదర్శిని, ఎమినిటిస్ కార్యదర్శి కె.లక్ష్మిభాయి, మహిళా పోలీసు పి.అశ్వని లేకపోవడంపై ప్రశ్నించారు. సెలవు పెట్టకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, అధికారుల అనుమతి లేకుండా గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్ ఫణిరాం, అదనపు కమిషనర్ ఆశాజ్యోతిలకు ఫోన్ చేసి, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు.
ఇదీ చదవండి; రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు