కొవిడ్ మహమ్మారి కారణంగా.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో నిలిచిపోయిన నిత్య అన్నదాన కార్యక్రమాలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖ సింహాద్రి అప్పన్న, కర్నూలు శ్రీశైల మహాక్షేత్ర ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
విశాఖలో..
సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిలిచిపోయిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కొవిడ్ కారణంగా గతేడాది మార్చి 28 నుంచి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం కొవిడ్ సడలింపులతో భక్తులకు నేటి నుంచి భోజనాన్ని అందించారు. శనివారం 2 వేల మందికి, సాధారణ రోజుల్లో 500 మందికి అన్నదానం సదుపాయం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
కర్నూలులో..
శ్రీశైలమహాక్షేత్ర దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఈవో కేఎస్ రామారావు పునఃప్రారంభించారు. కరోనా కారణంగా గతేడాది నుంచి.. అధికారులు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను సడలించిన్నప్పటి నుంచి.. ఆహార పదార్థాలను ప్యాకెట్ల రూపంలో భక్తులకు దేవస్థాన సిబ్బంది అందించారు. తాజాగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భోజనశాలోనే ప్రారంభించాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ.. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు భక్తులకు భోజనాలను ఆలయ సిబ్బంది అందించనున్నారు.
ఇదీ చదవండి: 'అభ్యర్థులను వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు'