కరోనా నిర్ధరణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నందున కేసులు పెరుగుతున్నాయని ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అన్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో సదుపాయాలకు కొరత లేదన్నారు. ఆగస్టులోనూ కేసులు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఉత్తరాంధ్రలో కేసులు పెరుగుతున్న కారణంగా ఆస్పత్రుల్లో 5 వేల పడకలు ఏర్పాటుచేశామన్నారు. మరణాల శాతం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సుధాకర్ తెలిపారు. కరోనా సోకి.. ఇతర రోగాలు లేనివారికి ఇళ్లలో చికిత్స అందించవచ్చని ఆయన అన్నారు. అయితే.. వారికి ఇళ్లలో అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు ఆస్పత్రుల్లోనే చికిత్స అందించే సామర్థ్యం ఉందన్న ఆయన.. అందువల్లే హోం ఐసోలేషన్‌పై దృష్టి పెట్టడం లేదన్నారు.
విశాఖ జిల్లాలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని డా. సుధాకర్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాలంటే కనీసం మూణ్నెళ్లు పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం కేజీహెచ్‌ను ఎంపిక చేశారన్న ఆయన.. ఆ తర్వాత ఐసీఎంఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. త్వరలోనే విధివిధానాలు తెలియజేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : తెలంగాణ: నిమ్స్‌లో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్