ఒక రోజు పూజ కోసమో, అలంకరణ కోసమో వినియోగిస్తే పూలు వాడిపోతాయి. తరువాత అవి వ్యర్థాలుగా మారిపోతాయి. ఈ వాడిన పూలు సైతం ఉపయోగపడతాయని అంటోంది విశాఖకు చెందిన 'గ్రీన్ వేవ్స్' ఎన్విరాన్ మెంటల్ సొల్యూషన్స్ సంస్థ. వాటితోనే సుగంధభరితమైన వాసనలు వెదజల్లే అగర్ బత్తీలు, దూప్ కడ్డీలు తయారు చేస్తోంది. ఒక్క అగర్ బత్తీల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా సబ్బులు, కొబ్బరి టెంకలతో గిన్నెలు, వస్త్రాలకు వినియోగించే బొత్తాలు వంటివి తయారుచేస్తున్నారు. పూలను ఎండబెట్టాక వాటిలో ప్రతిఒక్క భాగాన్నీ వినియోగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులకు అనువుగా ఉండే భాగాలను వేరు చేస్తూ పూల వ్యర్థాలను నూరు శాతం ఉపయోగపడేలా మారుస్తున్నారు.
జీరో వేస్ట్ సూత్రం
ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయంగా వేరుచేయాలనే ఆలోచనతో గ్రీన్వేవ్స్ను నెలకొల్పారు అనిల్. పర్యావరణ హితంగా ఉండాలన్న ఆలోచనలకు మరింత పదునుపెట్టి ఇప్పుడు జీరో వేస్ట్ సూత్రంతో ఈ సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టారు. తొలి దశలో కొన్ని దేవాలయాలతో ఒప్పందం చేసుకుని పూలు, కొబ్బరి కాయల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి పర్యావరణ హిత వస్తువులను, పదార్థాలను తయారు చేస్తున్నారు. ఓ వైపు ఆదాయ మార్గాన్ని కల్పించుకుంటూ, మరోవైపు ప్రకృతి ధర్మాన్ని కాపాడుతున్నారు. జీవీఎంసీ అధికారులు సైతం గ్రీన్ వేవ్స్ సంస్థ వినూత్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.
మహిళలకు శిక్షణ
ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెల్లే ఉద్దేశంతో గ్రీన్ వేవ్స్ పని చేయనుంది. ఆ దిశగా సామాజిక బాధ్యతగా వివిధ ప్రదేశాల్లో మహిళలకు పూల వ్యర్థాల నుంచి అగర్ బత్తీల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి యంత్ర పరికరాలు లేకుండా కేవలం చేతితో చేయగలిగే అవకాశం ఉన్నందున... ఇంటి వద్ద పనిచేసుకుంటూనే ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: వైద్యులు తరచూ వస్తున్నారని పాడేరులో యువకుడు పరార్