కరోనా రోగులకు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు విశాఖలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కొవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను విజయసాయి రెడ్డి పరిశీలించారు. కొవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు, ఫౌండేషన్ సభ్యులకు సూచించారు. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కొవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందే వీలుంటుంది. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు.
ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు.ఈ కేంద్రంలోనే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి