Minister Goutham Reddy Passed away: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల వైకాపా నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. స్నేహితుడు, సహచర మంత్రిని కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంజలి ఘటించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర ఆవేదనతో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చారు. కుమారుడి మృతితో కుంగిపోయిన గౌతమ్‌రెడ్డి తల్లి.. జగన్‌ను చూడగానే ఆయన చేతులు పట్టుకుని తీవ్రంగా రోదించారు. ఓదార్పుగా గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డిని జగన్ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి.. ఘటన వివరాలు తెలుసుకున్నారు. జగన్ సతీమణి భారతి.. గౌతమ్‌రెడ్డి భార్యను, తల్లిని ఓదార్చారు.
గౌతమ్‌రెడ్డి అకాలమరణం జీర్ణించుకోలేకపోతున్నాం: సజ్జల
గౌతమ్‌రెడ్డి అకాలమరణం జీర్ణించుకోలేకపోతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గౌతమ్‌రెడ్డికి నివాళి ఘటించిన సజ్జల.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆయన సొంత జిల్లా నెల్లూరుకు తీసుకెళ్లనున్నారు. రేపంతా నెల్లూరులో ప్రజల సందర్శనార్థం ఉంచి.. ఎల్లుండి ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
అత్యంత బాధగా ఉంది: మంత్రి బొత్స
గౌతంరెడ్డి హఠాన్మరణంపై మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని మంత్రి బొత్స అన్నారు. గౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గౌతంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి బొత్స భగవంతుడిని ప్రార్థించారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పట్ల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధను కలిగించిందన్నారు. గౌతమ్‌రెడ్డి నిజాయతీ పరుడని.. వివాదాలు లేకుండా పనిచేసిన మంత్రి అని పేర్కొన్నారు.
మంచి మిత్రుడిని కోల్పోయా : మంత్రి కొడాలి
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రులు.. ఆదిమూలపు సురేశ్, కొడాలి నాని, ఆళ్లనాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా చిన్న వయసులో మరణించటం బాధాకరమని మంత్రి సురేశ్ అన్నారు. మంచి సహచర మిత్రుడిని కోల్పోయానని మంత్రి కొడాలి నాని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారని.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం నిన్నటివరకు దుబాయ్‌లో పర్యటించారని ఆళ్ల నాని అన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోవడం.. పార్టీకి, జిల్లాకు తీరని లోటు అని మంత్రి అనిల్ అన్నారు. అందరితో నవ్వుతూ, కలివిడిగా ఉండేవారని.. సొంత అన్నయ్యను కోల్పోయినట్లు బాధగా ఉందన్నారు.
మరణం తీరని లోటు : పెద్దిరెడ్డి
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి.. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త అమితంగా బాధించిందన్నారు. చిన్న వయస్సులోనే గౌతమ్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని... నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దిరెడ్డి...ఆయన మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.
వివాదాలకు దూరంగా ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధిలో
ఐటీ మంత్రి అకాల మరణంపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు పుష్పశ్రీవాణి చెప్పారు. అందరితో కలిసి మెలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న గౌతమ్.. హఠాత్తుగా మరణించడం ఎంతగానో బాధించిందని మంత్రి చెరుకువాడ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్రంగా కలచి వేసిందని విజయనగరంజిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జెడ్పీ కార్యాలయంలో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో కృషి చేశారని ఆయన సేవలను కీర్తించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్‌తోపాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
సమర్థమైన నేతను కోల్పోయాం..
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై వైకాపా ఎమ్మెల్యే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి, సమర్థమైన నేతను కోల్పోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుసుకొని షాక్‌కు గురైనట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. గౌతమ్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని.. ఆయన మరణం రాష్ట్రానికి, వైకాపాకు తీరని లోట అన్నారు. మంత్రి మేకపాటి హఠార్మణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వాపోయారు. గౌతమ్‌రెడ్డి ఇక లేరన్న మాట వినడానికి బాధగా ఉందన్నారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని వైకాపా కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.
గౌతమ్ సొంత నియోజకవర్గంలో తీవ్ర విషాదచాయలు
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం.. ఆయన సొంత జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలను కలచివేస్తోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో వైకాపా నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు. నెల్లూరు డైకాస్ రోడ్డులోని మేకపాటి ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి అకాలమరణంపట్ల ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు... ప్రజల కోసం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
రెండు రోజులపాటు సంతాప దినాలు
గౌతమ్‌రెడ్డి అకాలమరణంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన మృతికి సంతాపంగా రాష్ట్ర సచివాలయంలో జాతీయపతాకాన్ని అవనతం చేశారు. గౌతమ్‌రెడ్డి ఛాంబర్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ సిబ్బంది గౌరవంగా చూసేవారని, ఆప్యాయంగా పలకరించేవారని వాళ్లు గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: