కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా నాయకుడు, తూర్పు కృష్ణా డెల్టా మాజీ ఛైర్మన్ గుత్తా చంటిపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు అకారణంగా దాడికి తెగబడ్డారు. తనపై దాడి చేసిన నాని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్టీఆర్ విగ్రహం ముందు గుత్తా చంటి నిరసన వ్యక్తం చేశారు. చంటి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో దివంగత పర్వతనేని జగన్మోహన్ రావు శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటావా అంటూ నాని అనుచరులు బాబ్జి, వల్లూరుపల్లి సుధాకర్ చంటిని విచక్షణా రహితంగా కొట్టారు. వెంటనే అప్రమత్తమైన స్టేడియం కమిటీ సభ్యులు గుత్తా చంటికి అడ్డంగా నిలబడి ఆయనను బయటికి పంపించి వేశారు.
అనంతరం వైకాపా నేతల తీరును ఖండిస్తూ ఎన్టీఆర్ విగ్రహం ముందు గుత్తా చంటితోపాటు పలువురు తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. అహంకారంతో విర్రవీగుతున్న వైకాపా నేతలు అకారణంగా తనపై దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చంటి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :