వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపుతో అన్నదాతపై ఎటువంటి భారం ఉండదని.. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయవాడలో తెలిపారు. నాణ్యమైన విద్యుత్ పంపిణీ సహా ఫీడర్లపై భారం తెలుసుకునేందుకే మీటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు జాగ్రత్తగా పని చేసేందుకే మీటర్లు ఏర్పాటు ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ మీటర్ల బిగింపుపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని అన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉత్తమ విద్యాబోధన కోసం విద్యావ్యవస్థలో దేశంలో ఎక్కడాలేని రీతిలో సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పాఠశాలలను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. మంచి పనులు ప్రజల్లోకి వెళ్లకూడదని , ప్రభుత్వానికి బయట అప్పులు పుట్టకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెచ్చిన అప్పులను పేదల కోసమే సీఎం జగన్ ఖర్చు పెడుతున్నారని, రూ.1.50 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కోసం అందరికీ అందిస్తున్నారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై నారా లోకేశ్ దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచించారు.
ఇదీ చదవండీ.. spice jet services: గన్నవరం నుంచి స్పైస్ జెట్ సర్వీసులు బంద్