వైఎస్ఆర్ జలకళ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 28 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలుత నియోజకవర్గానికి ఒక బోరు యంత్రం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్వహణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా బోరు యంత్రాల కొనుగోలుకు బదులుగా ఎక్కడికక్కడ అద్దె ప్రాతిపదికన తీసుకుని నిర్వహించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఈమేరకు యంత్రాలను అద్దె ప్రాతిపదికన తీసుకుని రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తారు. దీని కోసం 2 వేల 340 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలోని మెట్టప్రాంతాల రైతులకు ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 3 లక్షల మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బోర్ల తవ్వకాల ద్వారా మరో 5 లక్షల ఎకరాల వరకూ సాగులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. దరఖాస్తు నుంచి బోరు తవ్వే వరకూ ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం వెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. బోరు తవ్వకం సమయంలోనే భూగర్భ జలాల లభ్యతకు సంబంధించి అంచనా వేసిన అనంతరమే డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు.
గ్రామ సచివాలయాలు లేదా వాలంటీర్ల ద్వారా రైతులు బోర్ల తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఆన్లైన్లోనూ, భూగర్భ జలవనరుల శాఖ సహాయ డైరెక్టర్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చు. జియాలజిస్టు ద్వారా సర్వే చేయించిన అనంతరమే బోర్లు తవ్వేలా కార్యాచరణ చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉచిత బోరుబావులు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. బోరు తవ్వకంతో పాటు రీఛార్జి వెల్లనూ అదే సమయంలో సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఇదీచదవండి