విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జగన్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేయాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించేలా చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిందన్నారు.
విద్యుత్‌శాఖలో పోస్టుల భర్తీ..
మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.11,442 కోట్లు ఇచ్చిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ రంగాన్ని పట్టిష్టం చేయడానికి 7 వేలకుపైగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేశామని, 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం చేపట్టామన్నారు. 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా
విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2,342 కోట్లకుపైగా ఆదా చేసిందని నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిందని మల్లాది విష్ణు అన్నారు. 2019–21 మధ్య రెండేళ్లలో విద్యుత్తు కొనుగోళ్లలో అనుకూల విధానాల ద్వారా ఇది సాధ్యమైందన్నారు.
కరెంట్ ఛార్జీల పాపం చంద్రబాబుదే..
విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని మల్లాది విష్ణు ఆరోపించారు. ట్రూ–అప్ సర్దుబాటు కోసం 2014 నుంచి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు.
ఇదీ చదవండి
YV Subba Reddy: 'ప్రజల కోసమే అప్పులు.. తీర్చే సత్తా ప్రభుత్వానికి ఉంది'