పురపాలక ఎన్నికలకు తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై వైకాపా అభ్యతరం తెలిపింది. అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదని, ఇప్పడు మరో మేనిఫెస్టో విడుదలచేసి ఎలా అమలు చేస్తారో చెప్పాలని వైకాపా నేత అంబటి రాంబాబు ప్రశ్నిచారు. ఇలా మేనిఫెస్టో విడుదల చేయడం దగాకోరు చేయడమేనని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు కనీవినీ ఎరుగని రీతిలో గెలిచారని, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు కుప్పంలో బజార్లలో తిరగాల్సిన పరిస్ధితి వచ్చిందని తెదేపా కార్యకర్తలే అంటున్నారని విమర్శించారు.
కుప్పంలో ఓడింది ప్రజా స్వామ్యం కాదని.. చంద్రబాబే అన్న సంగతి ఇప్పడు తెలిపోయిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కుప్పానికి నీరు ఇవ్వలేకపోగా.. సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే కేసులు మాఫీ చేస్తానని చంద్రబాబు హమీలు ఇస్తున్నారని మండిపడ్డారు. తెదేపాకు నూకలు చెల్లాయని.. తిరిగి అధికారంలోకి రావడం కలే అని జోస్యం చెప్పారు. చంద్రబాబు కుప్పంలో ఉండాలో.. మరోచోటికి వెళ్లాలో తేల్చుకోవాలన్నారు.
నారా లోకేశ్ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన.. లోకేష్ వచ్చాకే సైకిల్ తునాతునకలైపోయిందని గమనించాలన్నారు. సీఎం పదవికి లోకేష్ ఆర్హుడు కాదన్న అంబటి.. పదవీ కాంక్షతో నారా లోకేశ్ ప్రస్టేషన్కు గురవుతున్నారని.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని భువనేశ్వరికి సూచించారు.
మమ్మల్ని ప్రశ్నించే, విమర్శించే హక్కు, సత్తా జనసేనకు లేదన్న అంబటి.. ఎవరికో సేవచేయడం మానుకుని జనసేనగా నిలబడితే మంచిదని సూచించారు.
ఇదీ చూడండి: జగన్ పరిపాలనలో.. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్: లోకేశ్