ఓటమి భయంతోనే వైకాపా స్థానిక ఎన్నికల వాయిదా కోసం పట్టుబడుతోందని ప్రభుత్వాన్ని తెదేపా నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. "తనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థమయ్యే ఎన్నికలంటే జగన్కు భయం పట్టుకుంది. స్థానిక ఎన్నికలనే ఎదుర్కోలేనివారు, ఇక సాధారణ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు. కేంద్ర ఎన్నికల సంఘమే బిహార్ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా అనేక ఉపఎన్నికలు నిర్వహిస్తోంది. స్థానిక ఎన్నికలు జరకపోవటం వల్ల ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని చెబుతున్న వైకాపా నాయకులు ఎన్నికలు వద్దని చెప్పడం ఓటమి భయమే. వద్దన్నది చేస్తూ... అందరూ కోరుకున్నది వద్దనే వితండ ధోరణి.. జగన్ ది.' అని యనమల విమర్శించారు.
జగన్ విధానంతో రాష్ట్రానికి, ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని యనమల విమర్శించారు. కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే అలా వీల్లేదని జగన్ సుప్రీం కోర్టు వరకూ వెళ్లారని... కరోనా తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే ఎందుకు ఎన్నికలు వద్దంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ప్రభుత్వ ప్రమేయం ఉండదని... ఏర్పాట్లకే పరిమితం కావాలన్నారు. ఎస్ఈసీ పిలిచినప్పుడు వెళ్లకుండా బయట మీడియా సమావేశాలు నిర్వహించటం సరికాదని హితవు పలికారు. మెజారిటీ పార్టీల అభిప్రాయం మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని యనమల స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ