రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజలను.. జగన్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ.6 వేల కోట్లు, జలజీవన్ మిషన్ కింద వచ్చిన రూ.7 వేల కోట్లు, రూసా నిధులను ఏం చేశారని యనమల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూసా పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించడంతో గత ఏడాది నుంచి నిధుల విడుదల నిలిపివేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్, రిజర్వ్ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను బహిర్గతం చేయాలని యనమల డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి