ఈ రోజు ఉదయాన్నే ఎక్కడున్నారని ఠక్కున అడిగితే.. వెంటనే ఆలోచనలో పడతాం. అటువంటిది వందల ఏళ్లకు పూర్వం.. వేల యేళ్ల తర్వాత.. పలానా తారీఖున ఏ వారం వస్తుందని అడిగితే ఠక్కున సమాధానం చెపుతోంది ఓ పాప. గణితంలో ఆరితేరిన మేథావో.. తలపండిన శాస్త్రవేత్తో కాదండీ.. 10 ఏళ్ల చిన్నారి హాసిని. తన ప్రత్యేక ప్రతిభతో ఐదు అద్భుత రికార్డులను సొంతం చేసుకున్న వండర్ కిడ్ తను.
ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి.. సాధించాలనే పట్టుదలతో సాధన చేస్తే చాలు లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపిస్తుంది విజయవాడ వండర్ కిడ్. చిన్న వయసులో అద్భుత ప్రతిభ కనపరుస్తూ.. వరుస రికార్డులను సొంతం చేసుకుంటోంది. మున్నంగి హాసిని శ్రీరూప. తన జ్ఞాపకశక్తికి పదునుపెడుతూ వివిధ రికార్డులు సొంతం చేసుకుంటోంది. పదేళ్ల ప్రాయంలోనే తన ప్రతిభా పాటవాలతో అబ్బురపరుస్తోంది. ఏకంగా పది వేల సంవత్సరాల క్యాలెండర్ మొత్తం ఔపోసాన పట్టింది. ఏ సంవత్సరంలోని తేదీని అడిగితే ఏ వారం వస్తుందో చెబుతుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కోసం కసరత్తు చేస్తోంది.
బాల్యం నుంచే..
హాసిని తండ్రి ఉమాశంకర్ విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో జూనియర్ సహాయకుడిగా పని చేస్తున్నారు. తల్లి జ్యోతి గృహిణి. మూడో ఏట.. ఇంగ్లీష్ రైమ్స్ సీడీని చూసి, అదే వరుసలో అన్నీ తిరిగి చెప్పటం తల్లి జ్యోతి గుర్తించింది. బాలిక జ్ఞాపకశక్తిని గమనించిన ఆమె.. ప్రతిభను మరింత మెరుగులు దిద్దేందుకు పలు పద్యాలు, కొత్త అంశాలు నేర్పించేది. వాటిని వేగంగా నేర్చుకుని కచ్చితత్వంతో చెబుతుండేది. బాల్యం నుంచే లెక్కలు, సైన్సు అంటే హాసినికి ఉండే ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు.
సెకన్ల వ్యవధిలోనే లెక్కలు..
యూకేజీ చదివే సమయంలో రాష్ట్రాలు, వాటి రాజధానులను హాసినికి తల్లిదండ్రులు నేర్పించారు. ఒక్క రోజులోనే అన్నీ చెప్పింది. తర్వాత.. 200 దేశాలు, వాటి రాజధానులను ఏడు రోజుల్లోనే నేర్చుకుంది. 30 పదాలను చెబితే.. తిరిగి అదే వరుసలో తప్పు లేకుండా చెప్పేది. ఆరేళ్ల వయస్సులో మేజిక్ స్క్వేర్స్‌ను సొంతంగా తయారు చేయడం నేర్చుకుంది. నెల రోజులు సాధన చేసి, 101 వరుసలతో కూడిన మేజిక్ స్క్వేర్‌ను రూపొందించింది. ఏ వరుస లెక్కించినా ఒకటే సంఖ్య వచ్చేలా సాధన చేసి తయారు చేసింది. లెక్కల్లో రెండు, మూడు డిజిట్ల కూడికలు, హెచ్చువేతలు, తీసివేతలు ఎంత పెద్దవి అయినా కేవలం సెకన్ల వ్యవధిలోనే చేస్తూ తన ప్రజ్ఞను చాటుతోంది.
చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి 63వ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన నటించిన 150 సినిమాలను విడుదలైన తేదీలతో సహా వరుసలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా విజయవాడలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన ప్రతిభను చాటింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 సినిమా పేర్లను వాటి విడుదల తేదీల ప్రకారం వరుస క్రమంలో చెప్పింది. చిరంజీవి సినిమా 'సైరా' ప్రీ రిలీజ్ సభ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 2019, సెప్టెంబరులో నిర్వహించారు. వేదికపై చిరంజీవి గురించి అనర్గళంగా మాట్లాడి అభిమానుల ప్రశంసలు పొందింది. వీరి కుటుంబాన్ని చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు.
సొంతంగా యూట్యూబ్ ఛానల్
తాను నేర్చుకుంది ఇతరులకు చెప్పడంతో పాటు, తన ప్రతిభను ప్రదర్శించేందుకు హాసిని విజయవాడ(hasini vijayawada) అనే పేరుతో యూ ట్యూబ్ ఛానల్‌ను తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. తన మేథస్సు, పద్యాలు వాటి అర్థాలు, సామాజిక అంశాలపై చేసిన వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తోంది. ఆరో ఏట నుంచి క్యాలెండర్‌పై సాధన చేయాలని నిర్ణయించి.. తొలుత 20 ఏళ్ల క్యాలెండర్‌పై దృష్టి పెట్టింది. ఇందులో పట్టు సాధించిన తర్వాత.. వందలు, వేల ఏళ్ల వరకు సాధన చేసింది. ఇప్పుడు పది వేల సంవత్సరాల క్యాలెండర్‌లోని ఏ తేదీని అయినా కేవలం నాలుగైదు సెకన్లలోనే ఏ వారం వస్తుందో ఠక్కున చెప్పేస్తుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రస్తుతం ప్రయత్నం చేస్తోంది. దీనికోసం ఇప్పటికే దరఖాస్తు చేసింది. మెమోరీ విభాగంలో క్యాలెండర్ శీర్షికన పెద్దలతో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నానని చిన్నారి హాసిని చెబుతోంది. తల్లిదండ్రుల కృషితోనే తాను అవార్డులు సాధించగలిగానని అంటోంది బాల మేథావి.
ఎన్నో రికార్డులు
2018, ఫిబ్రవరిలో.. జనరల్ నాలెడ్జి, లెక్కలు, క్యాలెండర్ విభాగాలలో ఆల్‌రౌండ్ పర్‌ఫార్మెన్స్ కింద ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 2018, మార్చిలో.. మూలకాల ఆవర్తన పట్టికలోని 118 మూలకాల పేర్లు, వాటి అణువిన్యాసం వివరాలను కేవలం 15 నిమిషాల్లోనే చెప్పి అందరినీ విస్మయపరిచింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కింది. 2018 మేలో.. ఆయా రంగాలలో 60 మంది భారతీయ ప్రముఖ మహిళల జీవిత చరిత్రను సంక్షిప్తంగా గంటలో చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. 2019 సెప్టెంబరులో.. ఆ ఏడాది క్యాలెండర్‌లోని తేదీలను అడిగితే వారం వివరాలను అన్నింటినీ కేవలం 20 నిముషాలలోనే చెప్పి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మళ్లీ చోటు సంపాదించింది.
2021 ఫిబ్రవరిలో.. 2వేల సంవత్సరాల క్యాలెండర్‌కు సంబంధించి ఏ తేదీ.. ఏ వారం వస్తుందో అడిగితే తడుముకోకుండా సమాధానం చెప్పి బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది హాసిని. ఈ అవార్డును విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు అందజేశారు. ప్రస్తుతం లిమ్కా బుక్‌లో చోటు కోసం సాధన చేస్తున్నానని.. గిన్నీస్ బుక్‌లో తన పేరు నమోదు చేసుకోవటమే లక్ష్యమని హాసిని చెబుతోంది.
ఇదీ చదవండి: పోలవరం ప్రధాన డ్యామ్ అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వం