కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో.. పట్టపగలే మహిళా దొంగలు కొత్త తరహాలో చోరీకి యత్నించి పట్టుబడ్డారు. పాత కేసులో రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండు సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ పచ్చిపాల కోటేశ్వరరావు.. తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు వచ్ఛి. గడియపెట్టిన ఇంటి తలుపులు తీసి లోపలకు ప్రవేశించారు.
టీవీ, ఫ్యాన్‌లు వేసుకుని చోరీ..
ఇంటిలోని బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును సంచిలో వేసుకున్నారు. ఇంటిలోకి ప్రవేశించగానే వీరు టీవీ, ఫ్యాన్‌లు వేసుకుని చోరీ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఇంటి యజమాని కోటేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చేసరికి తలుపు తీసి ఉండడం టీవీ మోత వినిపించడంతో పక్కనున్న బంధువులను బయటకు రమ్మని పిలిచి అతను లోనికి వెళ్లి చూశాడు. అప్పటికే లోపలున్న మహిళలిద్దరూ ఏమాత్రం తడబడకుండా మీరు ఎవరు? ఎందుకు వచ్చావని సాక్షాత్తు ఇంటి యజమానినే ప్రశ్నించడంతో అతను అవాక్కయ్యాడు.
ఇంటి యజమానినే ప్రశ్నించిన దొంగలు..
వెంటనే తేరుకున్న ఇంటి యజమాని నా ఇంట్లోకి వచ్చి నన్నే ఎవరని అడుగుతారా? అని గద్దించేసరికి అతని చెయ్యి పట్టుకుని లోపలకులాగే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పక్కకు తోసి బయటకు వచ్చిన కోటేశ్వరరావు అప్పటికే అక్కడ పోగైన బంధువుల సాయంతో వారిని పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పాప డైపర్‌లో బంగారు ఆభరణాలు దాచి..
మహిళా దొంగలిద్దరూ అత్తా కోడళ్లు అవుతారు. కోడలు నెల రోజుల క్రితమే పాపకు జన్మనిచ్చింది. వీరివెంట ఉన్న ఆ పాప డైపర్‌లో కూడా కొన్ని బంగారు ఆభరణాలను దాచడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: